High Court Serious on ANU Rural Development HOD: నిబంధనలకు విరుద్ధంగా ఓ విద్యార్థి ప్రవేశాన్ని రద్దు చేసిన ఆచార్య నాగార్జున వర్సిటీ గ్రామీణాభివృద్ది విభాగాధిపతి తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 15వేల రూపాయల ఖర్చులు పిటిషనర్‌కు చెల్లించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సొమ్మును గ్రామీణాభివృద్ధి హెచ్‌వోడీ డాక్డర్. దివ్వ తేజోమూర్తి తదుపరి నెల జీతం నుంచి మినహాయించాలని తేల్చిచెప్పింది. ఓ విద్యార్థి ప్రవేశాన్ని హెచ్‌వోడీ అకారణంగా రద్దు చేశారని ఆక్షేపించింది. పలు డిగ్రీలు కలిగి ఉండి, బీవోఎస్ పీజీ స్టడీస్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్న దివ్వ తేజోమూర్తి.. విద్యార్థి ప్రవేశాన్ని రద్దు చేయడం దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎంఏ గ్రామీణాభివృద్ధి కోర్టు అభ్యసించేందుకు ఎవరు అర్హులు, అనర్హులో ప్రాస్పెక్టస్‌లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. నాలుగు డిగ్రీలు చదివిన వ్యక్తికి అవి అర్ధం కాకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
హెచ్‌వోడీ దివ్య తేజోమూర్తి తీరుతో పిటిషనర్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తెలిపింది. వర్సిటీ అధికారుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడటానికి వీల్లేదంది. ఇలాంటి చర్యలను మొదట్లోనే ఉక్కు పిడికిలితో అణిచి వేయాలని పేర్కొంది. తన తప్పేమి లేకపోయినప్పటికీ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పించారని ఆగ్రహించింది. విభాగాధిపతి చేసిన తప్పుకి వర్సిటీపై ఆర్థిక భారం మోపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. పిటిషనర్‌కు చెల్లించిన సొమ్మును హెచ్‌వోడి నుంచి వసూలు చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈనెల 15న తీర్పు ఇచ్చారు. తీసుకున్న చర్యల విషయంలో నివేదిక ఇవ్వాలని రిజిస్రార్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేశారు.