High Court Permission to CPS Employees: సీపీఎస్ ఉద్యోగుల రేపటి ఛలో విజయవాడ కార్యక్రమంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ (High Court hearing) జరిపింది. పరిమితమైన ఆంక్షలతో కూడిన అనుమతులతో ఛలో విజయవాడ కార్యక్రమం జరుపుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగులు గుర్తింపు కార్డులను చూపించాలని స్పష్టం చేసింది. గతంలో సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమంతో స్తంభింప చేశారని ప్రభుత్వం తరుపు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదించారు. అనుమతులు ఇవ్వొద్దని కోరారు. కాగా, నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగబద్దమని, ప్రతి ఒక్కరి హక్కు అని కోర్టు పేర్కొంది. రేపు కాకుండా మరో రోజు ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించింది. తదుపరి విచారణ రేపటికి(సెప్టెంబర్ 1) వాయిదా వేసింది.
సీఎం జగన్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు అందోళన: సీఎం జగన్ తాజాగా విజయవాడలోని ఏపీ ఎన్జీవోల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సీపీఎస్ రద్దు సాధ్యం కాదని.. అందుకే ఓపీఎస్‌కు బదులు జీపీఎస్తీసుకొస్తున్నట్లు ఆ సభలో జగన్ పేర్కొన్నారు. అలాగే జీపీఎస్‌తో(GPS) ఉద్యోగులకు మంచి జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. అంతే కాకుండా జీపీఎస్‌పై ఆర్డెనెన్స్ సైతం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేయబోయే జీపీఎస్‌ను ప్రతి రాష్ట్రం కాపీ కొడుతుందని సీఎం జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం జీపీఎస్ ఆర్డినెన్స్(GPS Ordinance) వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారంలోకి రాకముందు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి.. తర్వాత ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కనీసం ఉద్యోగులతో చర్చించకుండా లక్షలాది కుటుంబాల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేందుకు సీఎం జగన్ చూస్తున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాలన్నీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే.. జీపీఎస్ ఎలా గొప్పది అవుతుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. వారందరికీ అన్యాయం చేస్తూ సీఎం జగన్ జీపీఎస్ ఆర్డినెన్స్ ప్రకటించడం బాధాకరమని అన్నారు.