ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో హై అలర్ట్​... మరింత పటిష్టంగా లాక్​డౌన్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగటంతో గుంటూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సంఖ్య మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్​జోన్​గా ప్రకటించటంతో పాటు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. రోగుల కుటుంబసభ్యులు, బంధువులను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు.

high alert in guntur district due to corona pandemic
high alert in guntur district due to corona pandemic

By

Published : Apr 1, 2020, 8:33 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి వేళ విదేశాల నుంచి ఎక్కువమంది వచ్చిన జిల్లాల్లో గుంటూరు ఒకటి. ఇక్కడ దాదాపు 3వేల మంది విదేశాల నుంచి వచ్చారు. కొవిడ్-19 నియంత్రణలో భాగంగా వారందరికీ హోం క్వారంటైన్ విధించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వారెవరికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ కాలేదు. ఈనెల 25వ తేదీన గుంటూరు నగరానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనెలాంటి విదేశీయానం చేయకపోవటంతో ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీయగా దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లివచ్చినట్లు తేలింది. ఆ తర్వాత రెండు రోజులకు అతని భార్యకు పాజిటివ్ వచ్చింది. ఈనెల 28న మరో రెండు కేసులు పాజిటివ్ అని తేలగా... వారిద్దరూ కూడా మొదటి వ్యక్తితో దిల్లీ నుంచి వచ్చినవారేనని గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంతమంది దిల్లీకి వెళ్లారనే కోణంలో విచారించగా ఒక్క గుంటూరు జిల్లా నుంచి 140మంది వరకూ వెళ్లినట్లు తేలింది. వారందరి వివరాలు సేకరించిన పోలీసులు వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. కొందరు ఆసుపత్రికి వచ్చేందుకు నిరాకరించారు. పోలీసుల సాయంతో వారిని క్వారంటైన్ కేంద్రాలకు, ఆసుపత్రులకు తరలించారు. ఈ క్రమంలో నిన్న ఒకేరోజు 5కేసులు పాజిటివ్​గా తేలాయి. అందులో నాలుగు దిల్లీ నుంచి వచ్చిన వారివే కాగా... మరొక కేసు పాజిటివ్ వచ్చిన వ్యక్తి భార్యది. మొత్తంగా జిల్లాలో 9 కేసులు నమోదు కాగా అందులో గుంటూరు నగరంలో 4, మాచర్ల పట్టణంలో 4, కారంపూడిలో ఓ కేసు ఉన్నాయి. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కలుషితమైనవిగా (కంటామినేటెడ్) గుర్తించిన అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వారు నివసించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్​జోన్​గా గుర్తించి... అటువైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేయటంతో పాటు పోలీసులను కాపలాగా ఉంచారు. అక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. ఇక వెంటనే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్​డౌన్ కంటే ఈ ప్రాంతంలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవీ లెక్కలు...
జిల్లాలో ఇప్పటి వరకూ 198 మంది నమూనాలు సేకరించి పంపగా అందులో 124 నెగిటివ్... 9 పాజిటివ్​గా వచ్చాయి. వీరిలో ఇద్దరు విజయవాడ, మిగతా ఏడు మంది గుంటూరులోని ఐడీ ఆసుపత్రి, కాటూరి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 65 మంది నివేదికలు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులు, బంధువులు కలిసి మరో 150మంది వరకూ కాటూరి ఆసుపత్రి ఐసొలేషన్లో ఉన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఎస్పీ విజయారావు పర్యటించారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానికులకు నిత్యావసరాల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండాలంటే మరింత కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అధైర్యపడవొద్దని, లాక్ డౌన్లో భాగంగా ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

మరింత అప్రమత్తం
పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఐడీ ఆసుపత్రిలో పడకలను 10నుంచి 25కు పెంచనున్నారు. అలాగే ఎన్.ఆర్.ఐ వైద్య కళాశాలలో కొవిడ్-19కు ప్రత్యేక చికిత్స విభాగాన్ని సిద్ధం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి దాన్ని త్వరలో వినియోగంలోకి తీసుకువస్తారు. నివేదికలు రావాల్సిన వారు, ఐసోలేషన్ల ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details