వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు.... గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉద్ధృతికి తుళ్లూరు దిశలో.... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పెదమద్దూరు వద్ద.. కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వరద నీటి మధ్యే వాహనంలో తరలించారు. మేడికొండురు మండలం పాలడుగు వద్ద.. వాగు ఉద్ధృతికి పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, పంట పొలాలు నీట మునిగాయి. సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. పెదకూరపాడు మండలం కంభంపాడు వాగు వద్ద కారు వరదలో కొట్టుకుపోగా స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. కృష్ణా తీరం వెంట వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. పత్తి, మిరప, కంద, పసుపు, కూరగాయల పంటలు వరదలో చిక్కుకున్నాయి.
మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, పత్తి, మినుములు, పసుపు, చెరకు పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైందన్న వ్యవసాయ అధికారులు..వానలు ఇంకా కొనసాగితే మరింత..... ప్రమాదమన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పంట పొలాల్లోకి నీరు చేరి అన్నదాతలు దిగాలు పడ్డారు. కొప్పునూరు, ద్వారకాపురి, విజయ పురి సౌత్ గ్రామాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రవంక వాగు ఉద్ధృతికి జనావాసాలు నీటమునిగాయి. చప్టాపై ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలునిలిచిపోయాయి. వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. అచ్చంపేట మండలంలో వరదని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసు బృందం వాహనంతో సహా ప్రవాహంలో చిక్కుకున్నారు. స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరారు.