గుంటూరు జీజీహెచ్ లో గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు.. ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. జూడాలతో డి.ఎం.ఈ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా.. డీఎంఈ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న వైద్యుడిపై దాడి హేయమైన చర్య అని అన్నారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతే తప్ప, వైద్యులపై దాడి చేస్తే.. మెడికల్ చట్టప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు.
ఏం జరిగిందంటే?
గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులపై ఓ రోగి బంధువులు దాడి చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో.. దాడికి పాల్పడ్డారు. ఈ చర్యను జూడాలు నిరసించారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. గడిచిన మూడోరోజులుగా జూనియర్ వైద్యులు ఆందోళన కొనసాగించారు. వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు. గురువారం విధులు బహిష్కరించిన జూడాలు.. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే.. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేయాలంటూ జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేవరకు తాము విధులకు హాజరుకాబోమని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.