కర్ణాటకలోని ఆలమట్టిని దాటి నారాయణపూర్ జలాశయాన్ని చేరుకున్న కృష్ణమ్మ నిండుకుండలా మారింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 29 టీఎంసీలు నిండింది. ఉదయం అధికారులు 18 గేట్లను ఎత్తివేశారు. నారాయణపూర్ జలాశయానికి ఆలమట్టి ద్వారా 91 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 1.02 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భారీ నీటి విడుదలతో కృష్ణా పరివాహకంలోని తెలంగాణ, కర్ణాటక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
సాయంత్రానికి జూరాలను చేరనున్న కృష్ణమ్మ
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరిగెత్తుకొస్తోంది. కర్ణాటకలోని నారాయణపుర్ జలాశయం 18 గేట్లను అధికారులు ఈ ఉదయం తెరిచారు. సాయంత్రానికల్లా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకోనుంది.
జూరాల జలాశయంలో ప్రస్తుతం 1.98 టీఎంసీల నీరు ఉంది. 2.88 టీఎంసీలకు చేరుకుంటే ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అందుతాయి. ఆ మార్కును చేరుకోగానే నెట్టెంపాడు లిఫ్టుతో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి జలాశయాలకు నీటిని ఎత్తిపోయనున్నారు. కోయిల్‌సాగర్ లిఫ్టుతో ఫర్దీపూర్, కోయిల్‌సాగర్ జలాశయాలను, భీమా-1 లిఫ్టుతో భూత్పూరు, సంగంబండ, భీమా-2 లిఫ్టుతో ఏనుకుంట, శ్రీరంగాపూర్ జలాశయాలను నింపనున్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:విస్తారంగా వర్షాలు-జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ