గుంటూరు జిల్లాలో నాలుగో విడత ఎన్నికలు 6 నియోజకవర్గాలు... 19 మండలాల పరిధిలో జరగునున్నాయి. ఈ కారణంగా.. అందరి దృష్టి చివరి విడత పంచాయతీ ఎన్నికలపైనే కేంద్రీకృతం అయ్యింది. గుంటూరు జిల్లాలో తొలి మూడు విడత ఎన్నికలు సాపీగా నిర్వహించడంలో విజయవంతమైన జిల్లా అధికారులు... నాలుగో విడత ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఎన్నికల్లో... పెద్దసంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.
నాలుగో విడత పంచాయతీ ఎన్నికలను... 266 గ్రామపంచాయతీల్లో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇందులో 27 పంచాయతీలు, 2,810 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 239 పంచాయతీ సర్పంచి పదవులకు 724 మంది, 2085 వార్డులకు 4 వేల 423 మంది పోటీపడుతున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలతోపాటు గుంటూరు గ్రామీణ మండలంలోని 9 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
19 మండలాల్లో చివరి విడత ఎన్నికల ప్రక్రియకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తుండగా...మరోవైపు అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చివరి విడతలో అమరావతి, పెదకూరపాడు, పెదకాకాని, ప్రత్తిపాడు, పెదనందిపాడు, తాడికొండ, పొన్నెకల్లు, ఫిరంగిపురం, నంబూరు, వట్టిచెరకూరు, ముట్లూరు, వరగాని, జొన్నలగడ్డ, కంతేరు, నిడుముక్కల వంటి జనాభాపరంగా పెద్ద గ్రామాలున్నాయి. వీటి ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేటి సాయంత్రం (శుక్రవారం) తో ప్రచారం గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు.