ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇసుక నిల్వతో కరకట్టకు ముప్పు'

రాజధాని అమరావతి పరిధిలో తాళ్లాయపాలెం పుష్కర ఘాట్‌ సమీపంలోని కృష్ణా నది కరకట్టకు ఆనుకొని ఉన్న భూముల్లో ఇసుక డంపింగ్‌పై రైతులు, పోలీసుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూముల్లో ఇసుక తవ్వకాలు జరపటంపై అన్నదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటి వల్ల కరకట్ట భద్రతకు ప్రమాదం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : Jun 9, 2021, 12:00 PM IST

Updated : Jun 10, 2021, 11:23 AM IST

sand dumping
ఇసుక డంపింగ్‌

రాజధాని అమరావతి పరిధిలో తాళ్లాయపాలెం పుష్కర ఘాట్‌ సమీపంలోని కృష్ణా నది కరకట్టకు ఆనుకొని ఉన్న భూముల్లో ఇసుక నిల్వకు ఏర్పాట్లు చేయడంపై రైతులు ఆందోళనకు దిగారు. డంపింగ్‌ ఏర్పాట్లను అడ్డుకునేందుకు బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు కరకట్ట దగ్గరకు చేరుకున్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ చేస్తున్న పనులను వెంటనే నిలిపేయాలని స్పష్టం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల్ని నిలువరించారు. పనులు అడ్డుకునేందుకు యత్నిస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అభ్యంతరాలుంటే సీఆర్‌డీఏ కమిషనర్‌కు తెలియజేయాలన్నారు. గనుల శాఖ, సీఆర్‌డీఏ నివేదిక ఇస్తే ప్రైవేటు సంస్థపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల రైతులు నిరసన తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాజధాని నిర్మాణానికే భూములిచ్చాం..
రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో సీఆర్‌డీఏ, రైతుల అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ ఇసుక నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని అమరావతి రైతులు యుగంధర్‌, శిరీష, రాజేంద్ర పేర్కొన్నారు. కరకట్టకు ఆనుకుని ఉన్న భూముల్లో గోతులు తవ్వి ఇసుక డంపింగ్‌ చేస్తున్నారని, ఫలితంగా ఆ గుంతల్లో నీరు చేరి కరకట్ట బలహీనంగా మారి తెగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రాజధాని నిర్మాణానికి మాత్రమే భూములిచ్చామని, ఇసుక నిల్వకు కాదని స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఫోన్‌ చేయగా.. డంపింగ్‌ చేసేందుకు ప్రైవేటు సంస్థకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

Last Updated : Jun 10, 2021, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details