నరసరావుపేటలో 150 కిలోల కల్తీ నెయ్యి పట్టివేత - hyderabad
అధికారుల దాడుల్లో 150 కిలోల కల్తీ నెయ్యి పట్టుబడింది. నరసారావుపేటలో బయటపడిన ఈ నెయ్యి నమూనాలను.. పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో 150 కిలోల కల్తీ నెయ్యిని జిల్లా ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నెల్లూరులో పట్టుబడిన కల్తీ నెయ్యి ప్యాకెట్లపై నరసరావుపేట చిరునామా ఉన్న కారణంగా.. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. పట్టణంలోని రామిరెడ్డిపేటకు చెందిన హరిశ్రీనివాస్ అలియాస్ కలకత్తా శ్రీను అనే వ్యక్తి అతని ఇంటివద్ద ఆవునెయ్యి, సాధారణ నెయ్యిని తయారు చేసి సుధా ఆవునెయ్యి ప్యాకెట్లను ప్రభుత్వ అనుమతి లేకుండా వివిధ ప్రాంతాలకు పంపుతూ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన 150 కిలోల నెయ్యిని సీజ్ చేసి రెండు ప్యాకెట్లను కల్తీ నిర్ధారణ కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. నెయ్యి కల్తీగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.