ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవిష్యత్తులో విపక్ష నేతల ప్రాణాలు తీస్తారేమో?'

ప్రజలను రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశం ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అమరావతి కోసం పోరాడినందుకు గతంలో తనని అరెస్టు చేసినట్లే ఇపుడు తెదేపా నేతల్ని కేసుల పేరిట వేధిస్తున్నారని దుయ్యబట్టారు. విపక్ష నేతల్ని ఇంతవరకూ ఎవరినీ చంపలేదని అదే సంతోషమని గల్లా జయదేవ్ అన్నారు. భవిష్యత్తులో అది కూడా చేస్తారేమో అని వ్యాఖ్యానించారు. దృశ్య, శ్రవణ విధానాల్లో శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని లోక్​సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్​కు లేఖ రాసినట్లు వెల్లడించారు. చైనాకు ధీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. మరెన్నో విషయాలను ఆయన ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

galla jayadev
galla jayadev

By

Published : Jun 18, 2020, 6:17 PM IST

గల్లా జయదేవ్​తో ముఖాముఖి


ప్ర : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టింది దీన్ని ఎలా చూస్తారు?

జ : అసలు మూడు రాజధానుల ఆలోచనే వివాదాస్పదం, అసంబద్ధం, అనైతికం, అన్యాయం... వైకాపా నాయకులందరూ శాంతిభద్రతలను, చట్టాలను పట్టించుకోరు. న్యాయాన్ని అనుసరించరు. ఇపుడు ప్రభుత్వం చర్యలతో ప్రజలు ఆగ్రహిస్తే పరిస్థితి ఏమిటి. కరోనా నిబంధనలు అన్నీ ఉల్లంఘించి మళ్లీ ధర్నాలు మొదలు పెడితే వైరస్ వ్యాప్తించెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కనీసం బాధ్యతతో వ్యవహరించలేదనేందుకు ఇదే నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో వివాదాలు తీసుకురావటం మంచిదికాదు.

ప్ర : ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడి.. ముఖ్యంగా తెలుగుదేశాన్నే లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ నాయకులనే అరెస్టు చేయడం.. కేసులు పెట్టడం గురించి ఏమంటారు?

జ : ఈ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందని తెలుసు. అమరావతి రైతుల కోసం పోరాటం చేసినప్పుడు నన్ను అరెస్టు చేశారు. అర్థరాత్రి వరకూ జిల్లా మొత్తం తిప్పారు. అపుడే ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని అర్థమైంది. ఇప్పటి వరకైతేఎవరిని చంపలేదు. ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం.. అది కూడా ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. అచ్చెన్నాయుడిని ఎంత హించించారంటే.. అర్ధరాత్రి లేపి, మందులు లేకుండా, కుటుంబంతో మాట్లాడకుండా... ఒక ఉగ్రవాది మాదిరిగా బయటకు తీసుకొచ్చారు. కారులో ఒక రోజంతా ప్రయాణం చేయించి వందలాది కిలోమీటర్లు తిప్పారు. గుంటూరు జీజీహెచ్ కు చేరేసరికి 24 గంటలు అయ్యింది. అన్ని గంటలు నొప్పితో అపరేషన్ ఎక్కడ జరిగిందో దానిపైనే కూర్చొని అంతసేపు ప్రయాణం. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు, న్యాయం, అభివృద్ధి ఉండదు.

ప్ర : కొవిడ్ రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. దీని నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సలహాలు ఇస్తారు? అమెరికా వంటి దేశాలతో పోటిపడుతున్న పరిస్థితి, ఐదారు స్థానాల్లోకి వెళ్లిపోతున్నాం....

జ : ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలోనే కఠినంగా లాక్‌డౌన్ అమలు చేశారు. అందువల్ల ప్రారంభంలో బాగా నియంత్రించాం. ఒకేసారి పెరిగిపోతే మన ఆరోగ్యాన్ని నియంత్రించలేము కాబట్టి.. దాన్ని తగ్గించడానికి లాక్‌డౌన్ పెట్టారు. మనం సిద్ధమవడానికి లాక్‌డౌన్ పెట్టారు. కానీ ఎంత వరకు సిద్ధమయ్యామో ఆలోచన చేయాలి. కనీసం వైద్య, ఆరోగ్యపరమైన మౌళిక వసతులు పెంచుకోలేకపోయాం. లాక్ డౌన్ ఎత్తేశాక కేసుల సంఖ్య చూస్తుంటే విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. ఒకేసారి పెరిగితే బెడ్స్, వెంటిలేటర్స్ సరిపోతాయ లేదా? మొన్న నేను పరిశీలన కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాను. రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి రెండు నెలలు అవుతోంది.. ఈ రెండు నెలల్లో 50 లక్షల కూడా ఖర్చు పెట్టలేదు. ఇంకా 1.9 కోట్ల వరకు ఆర్డర్స్ చేశారు, వస్తువులు ఇంకా చేరలేదు. మిగిలిన 60 లక్షలకు కనీసం ఆర్డర్ కూడా చేయలేదు. డబ్బులు ఉండి కూడా రెండు నెలలకు పైగా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు. ఎందుకు సిద్ధమవలేకపోయారో ఆలోచన చేయాలి. జవాబుదారీతనం ఉండాలి కదా. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది.

ప్ర : దేశవ్యాప్తంగా చూస్తే కొవిడ్ వల్ల ఈ పారిశ్రామిక రంగంపై ఎలాంటి ప్రభావం పడింది?

జ : పెద్ద కంపెనీలు అయితే ఎలాగోలా నెట్టుకొస్తాయి. పూర్తి లాక్‌డౌన్ సమయంలో అమరరాజా గ్రూపుకి రోజు 2 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సడలింపులు ఇచ్చిన తర్వాత 60, 70 శాతం వరకు పని చేస్తున్నాం. నష్టాల నుంచి కొంత రికవరీ అవుతున్నాము. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 80 శాతం మంది ఉద్యోగులు ఉంటారు. అందుకే వాటిని రక్షించాలి. వాటిని మూసివేయాల్సి వస్తే.. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆదాయం పోతుంది. రైతులను, చిన్న పరిశ్రమలను బాగా చూడాలి... ఎందుకంటే రైతులు లేకపోతే ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఉద్యోగుల సంక్షోభం వస్తే ఆకలి చావులకు ఆస్కారం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే బదులు ఉద్యోగులకు జీతాలు ఇస్తే ఆర్ధికంగా ప్రక్రియ కొనసాగుతుంది. ఆ మద్ధతు ఇవ్వకపోతే.. ఉద్యోగాలు పోతే ప్రత్యక్షంగా నగదును ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే వారు తిండి లేక చనిపోయే ప్రమాదం ఉంది.

ప్ర : వివిధ రంగాల వారికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అది ఎంత వరకు కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది.

జ : ఉద్దీపన ప్యాకేజి 10శాతం అని కేంద్రం చెప్పింది కానీ... అది కేవలం 2 శాతం అని నిపుణులు తేల్చారు. మిగతా 8 శాతం ఎప్పుడో వేర్వేరు రూపాల్లో వస్తుంది. లాంగ్ టైంలో ఆర్థిక ప్రయోజనాలు రావొచ్చు. అంతేకాని.. వెంటనే వచ్చే ప్రయోజనాలు కావు. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలను చూస్తే 10 నుంచి 15 శాతం.. జపాన్ లాంటి దేశం 20 శాతం మేర ఉద్దీపన ప్యాకేజి ఇచ్చింది. మనం కనీసం 10 శాతం ఇవ్వకపోతే కష్టమవుతుంది. ఇచ్చింది సరిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆలోచించాలి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆ విషయం కూడా మాట్లాడతారు. గతంలో ప్రధాని మోదితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు 10 శాతం జీడీపీ పెట్టుకోండి. అప్పుడు సరిపోతుందని కూడా చెప్పాను.

ప్ర : కరోనా సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఎలా జరపాలంటారు.. ఎక్కవ మంది వస్తే ఇబ్బంది కూడా ఉంటుంది. మీరు లేఖ కూడా రాశారు. మీ సలహాలు ఏంటి?

జ : ఖచ్చితంగా వర్షాకాల సమావేశాలు జరపాలి. కొవిడ్ ప్రారంభంలో వచ్చినప్పుడు మేము పార్లమెంట్ లో ఉన్నాం. అప్పుడు అసహనానికి గురయ్యాను. కొవిడ్ సంక్షోభం ప్రపంచంలో పెరిగిపోతున్నా పార్లమెంట్ సమావేశాలు జరిపారు. కనీసం కరోనా గురించి అపుడు చర్చించలేదు. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ పాస్ చేసేటప్పుడు ఈ కొవిడ్ వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే చర్చ లేదు. అన్ని బిల్లులను ఆమోదించారు. దేశ, విదేశాల నుంచి రోజు 10 వేల మంది పార్లమెంటుకు వస్తుంటారు వెళ్తుంటారు. వైరస్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు... ఎక్కడికైనా వెళ్లోచ్చు. ఆ జాగ్రత్తలు చూసుకోవాలి. అందుకని తక్కవ సంఖ్యలో అనుమతించాలి. ఎంపీలందరిని దిల్లీ రమ్మనండి.. వారి వారికి కేటాయించిన భవనాల్లో ఉండి.. దృశ్య శ్రవణ విధానంలో హాజరయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. పార్లమెంటు జరిగేటప్పుడు ఆ రోజు ఎవరెవరు మాట్లాడుతున్నారో వారు మాత్రమే భౌతికంగా సభలోకి వచ్చి మాట్లాడిన తర్వాత వెళ్లిపోవచ్చు. బిల్లులు మామూలుగా ఆమోదం పొందితే సరి. ఒకవేళ ఓటింగ్ నిర్వహించాల్సి వస్తే ఇంటి నుంచి స్లిప్పులు సేకరించి లెక్కిస్తే సరిపోతుంది. రాజ్యసభ, లోక్‌సభ టీవీల్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కొన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే బాగుంటుందని చెప్పాను.

ప్ర : దేశ సరిహద్దులో చైనా గొడవలకు దిగుతోంది. ఈ వివాదంపై ఎలా స్పందిస్తారు?

జ : చైనాలో చాలా సంక్షోభం వచ్చింది. ప్రపంచం మొత్తం ఒక యాంటీ చైనా ఫీలింగ్ వస్తోంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపెనీలు బయటకు వెళ్లిపోతున్నాయి. వియాత్నంకు వెళ్తున్నాయి.. ఇండియాకు వస్తున్నాయి. వేరే దేశాలకు వెళ్తున్నాయి. 1967లో యుద్ధం, 1975లో అరుణాచల్ ప్రదేశ్ లో వివాదం చూసినా... దేశంలో అంతర్గతంగా ఇబ్బందులు వచ్చినప్పుడే మొదలైన విషయం గుర్తించారు. ఇపుడు కూడా అలానే అనిపిస్తుంది. హాంకాంగ్, తైవాన్, సౌత్‌ చైనాసీ, ఇండియా తో చైనా ఘర్షణ పెట్టుకుంది. ఈ వివాదాలన్నీ ఆ దేశంలోని ప్రదల దృష్టిని మరల్చేందుకు చేసినట్టుంది.

ప్ర... కరోనా కారణంగా చైనా ప్రతిష్ట మసకబారింది. దాన్నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి వివాదాలు సృష్టిస్తుందనే అభిప్రాయం ఉంది. మీరేమంటారు.

జ... అందులో 100శాతం నిజం ఉంది. కోవిడ్ 19 అనేది చైనా వైరస్. వ్యూహాన్ లో పుట్టింది.గతంలో స్పానిష్ ఫ్లూ అనేది వచ్చింది. ఆ వైరస్ అక్కడ పుట్టకపోయినా అక్కడే విస్తరించటంతో ఆ పేరు పెట్టారు. మరి దీనికి చైనా వైరస్ అని ఎందుకు అనటం లేదు. వైరస్ వచ్చిన విషయం జనవరి వరకూ చైనా దాచిపెట్టింది. రెండు నెలలకు పైగా ఆ విషయం పొక్కనీయకపోవటం వల్ల విదేశాలకు పాకింది. అదే సమయంలో వ్యూహాన్ నుంచి తమ దేశంలోని ఇతర నగరాలకు వైరస్ వ్యాపించకుండా చైనా కట్టడి చేసింది. ప్రపంచంలోని ముఖ్యమైన నగరాలన్నింటికి వైరస్ పాకినా పట్టించుకోలేదు. చైనా నుంచి అన్ని దేశాలకు రాకపోకలను కొనసాగించటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

ప్ర.. ఇపుడు భారత దేశం ముందున్న కర్తవ్యం ఏమిటి. చైనాకు ఎలా సమాధానం చెప్పాలి.

జ... ఎట్టి పరిస్థితుల్లో వెనకడుకు వేయకూడదు. గట్టిగా నిలబడాలి. చైనా రెచ్చగొడుతోంది. మనం అందుకు ధీటుగా సమాధానం ఇవ్వాలి. లేకపోతే చైనా అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి

ద్రవ్యవినిమయ బిల్లు ఆగడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: యనమల

ABOUT THE AUTHOR

...view details