Employees on ROSA Rules: రోసా నిబంధనలను సమూలంగా మార్చాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అర్హతతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన సంఘాలకు గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వానికి వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ వెసులుబాటు లేకుండా ఉండాలంటే రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎంపిక చేసుకునే విధానాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ సంఘానికి ఆ సంఘం అని కాకుండా.. అందరికీ కలిపి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరపాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని వెల్లడించారు. రోసా రూల్స్ మార్పు చేర్పుల మీదే కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిబంధనలను కూడా మార్చాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. చాలా ఉద్యోగ సంఘాల్లో ద్వంద్వ సభ్యత్వం ఉందన్న అయన ఇది తప్పుడు విధానం అని.. దీన్ని సరిద్దిదాలని కోరతామన్నారు.
నిబంధనల్లో మార్పులు చేర్పులు అవసరం లేదు:రోసా రూల్స్ మార్చాల్సిన అవసరం లేదని వాటిని యథాతథంగా కొనసాగించి సక్రమంగా అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు కోరారు. ప్రస్తుతమున్న రూల్సును సమూలంగా మార్చాలని కొన్ని సంఘాలు చేస్తున్న వాదన సరైంది కాదన్నారు. ఇంటిలో ఎలుక దూరిందని.. ఇంటిని తగులపెట్టుకోవడం సరైన పని కాదని.. ఎలుకను తరిమి కొట్టాలని తాము అధికారులకు చెప్పామన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, పండిత పరిషత్ సంఘాలకు నిబంధనలు అతిక్రమించి.. రిలాక్సేషన్ తీసుకుని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి వచ్చాయన్నారు. ఉద్యోగులందరికీ ఉమ్మడిగా ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ట్రేడ్ యూనియన్ సంఘాల మాదిరిగా ఉద్యోగ సంఘాలకు ఉమ్మడి ఎన్నికలు జరగవని తెలిపారు.
"రోసా నిబంధనలు యథాతథంగా అమలుచేయాలని కోరాం. పలుకుబడితో వచ్చి, నిబంధనలు అతిక్రమించి, సడలింపు పొందిన సంఘాలు.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆపస్ ఉన్నాయి. వాటిని రద్దు చేయాలి. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. ఆర్టీసీలో ఎన్‌ఎంయూ, ఈయూ సంఘాలకు గుర్తింపు ఇచ్చారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలకే ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు ఎన్నికలు జరగవు"-బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్