CBN HELD STRATEGIC MEETING :ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు 6 గంటల పాటు సాగిన భేటీలో ముందస్తు ఎన్నికలపై చర్చించారు. సీఎం జగన్ ముందుగా ఎన్నికలకు వెళ్తారనే సమాచారం తనకుందని.. వెళ్లినా, వెళ్లకపోయినా ..కేడర్‌ను సంసిద్ధంగా ఉంచాల్సిన తక్షణ కర్తవ్యం పార్టీపై ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికలకు దారితీసే పరిణామాలపై భేటీలో విశ్లేషించారు.
సాధారణ ఎన్నికల లోపు వివేకా నిందితులు ఎవరో తేలుతుంది.!: మార్చి తర్వాత కేంద్రం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే.. ఒకటి రెండు నెలలు తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. చంద్రబాబు, లోకేశ్ సభలకు వస్తున్న ప్రజాదరణకు జడిసి ఓటమి భయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని నేతలు విమర్శించారు. సాధారణ ఎన్నికల్లోపు వివేకా హత్య కేసు నిందితులెవ్వరో తేలిపోతుందని.. ఆలోగా ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నారనే చర్చ జరిగింది.
మార్చి తర్వాత చేతులెత్తేసే దిశగా వైఎస్సార్సీపీ: మార్చిలో వచ్చే బడ్జెట్ వెసులుబాటు 3నెలలు ఉపయోగించుకుని తర్వాత చేతులెత్తేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందనే అభిప్రాయానికి సమావేశం వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డిలతో పాటు మొత్తం 75 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ జరిగింది. వీటన్నింటిని నుంచి తప్పించుకునేందుకు విశాఖ రాజధాని రెఫరెండంగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లచ్చనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేశారు.