ఉద్యోగం చేస్తూనే సుభాష్ పాలేకర్ వీడియోలు చూసి ప్రకృతి సాగుపట్ల ఆకర్షితుడయ్యాడు. ఇక అంతే లక్షలు జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ కొలువుకు టాటా చెప్పేసి పొలంలో వాలిపోయాడు. తమకున్న నాలుగున్నర ఎకరాలకు తోడు మరో ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకున్నాడు. పలు రకాల పండ్లసాగుతో వ్యవసాయం మొదలుపెట్టాడు.
తొలి ఏడాది.. అరటి, బొప్పాయి, జామ, సీతాఫలం పంటలు సాగు చేశాడు కోటిరెడ్డి. గతేడాది చామంతి, మొక్కజొన్న, సన్ ఫ్లవర్ తోటలు వేసి అధిక లాభాలు పొందాడు. సాగుబడిలో ఎప్పటికప్పుడు మెళకువలు నేర్చుకుంటున్న కోటిరెడ్డి.. ఈ ఏడాది పండ్ల తోటల్లో అంతర పంటల విధానాన్నిఅనుసరిస్తున్నాడు. పలుచోట్ల జరిగే వ్యవసాయ తరగతులకు హాజరవుతూ,... సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నాడు.