రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా నిర్ధరణ అయింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో 252 మందికి కరోనా... 20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి తీవ్రమైంది. తాజాగా 20 గంటల్లో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 252కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా ఇవాళ కర్నూలు జిల్లాలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దిల్లీలో మత ప్రార్థనలకు హాజరై వచ్చినవారు, వారి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్ తేలింది. అంతేకాకుండా వారి సంబంధీకులు ఆరుగురికి ఈ వైరస్ సోకింది. వీరితో పాటు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలిందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. మొత్తం బాధితుల్లో ఐదుగురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు.