కోర్టు ఆదేశాలు బేఖాతరు.. కొనసాగుతున్న బాప్టిజం ఘాట్ పనులు Construction Works of Baptism Ghat: పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించినా.. మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులను ఆపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు స్టే ఆర్డర్ తమకు ఇంకా అందలేదని పోలీసులు అంటున్నారు.
హైకోర్టు ఆదేశాలు: మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ నిర్మాణంపై హైకోర్టు స్టే విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బాప్టిజం ఘాట్ నిర్మాణం వివాదానికి దారి తీయడంతో.. ఈ ఆంశం కోర్టుకు చేరింది. డొంక భూమిలో నిర్మాణం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
బాప్టిజం ఘాట్ నిర్మాణం వివాదానికి కారణం: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొన్ని నెలల క్రితం.. మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ స్థలాన్ని బాప్టిజం ఘాట్ నిర్మాణానికి కేటాయించారు. తెనాలి రోడ్డులోని తాగునీటి పథకం సమీపంలో ఈ స్థలం ఉంది. కాగా ఇటీవలే బాప్టిజం ఘాట్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి భూమి పూజ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నెల వేతనాన్ని.. బాప్టిజం ఘాట్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్న వేళ.. స్థానిక బీజేపీ నేతలు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు, హిందూ సంఘాల అభ్యంతరం: మతమార్పిడిలను ప్రోత్సహించేందుకు ఈ ప్రదేశంలో బాప్టిజం ఘాట్ నిర్మిస్తున్నారని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే ఇదంతా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులపై తమ నిరసన వ్యక్తం చేస్తూ.. ఘాట్ నిర్మాణం వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ నేతలు, హిందూ సంఘాల.. నిరసనలు, ఆరోపణలపై మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ స్పందించింది.
మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే?:మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఘాట్ నిర్మాణాన్ని బీజేపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాస్టర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఎటువంటి మత మార్పిడిలు లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా ఘాట్ నిర్మాణం జరుగుతుందని వివరణ ఇచ్చింది. హిందూ ధార్మిక సంస్థలకు అనుమతులు ఇచ్చినప్పుడు.. తాము ఎటువంటి అభ్యంతరం తెలపలేదని.. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కులున్నాయని తెలిపింది.