CM REVIEW ON WELFARE HOSTELS : మహిళా, శిశు సంక్షేమశాఖతో పాటు సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మూడు దశల్లో "నాడు – నేడు " అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 13 గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడు పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. మొదటి దశలో 13 వందల 66 చోట్ల చేపట్టే పనుల కోసం రూ.15 వదంల కోట్లు, మూడ దశల్లో కలిపి రూ. 3వేల 364 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. జనవరిలో ప్రారంభించే తొలి విడత పనులు ఏడాదిలోగా పూర్తిచేయాలన్న సీఎం... మూడేళ్లలో మూడుదశల పనులు అయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.
హాస్టళ్లలోకి ప్రవేశిస్తే జైల్లోకి వచ్చామనే భావన పిల్లలకు కలగకూడదన్న సీఎం.. వాళ్లకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తాయని గుర్తుచేశారు. వాళ్లు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలన్నారు. హాస్టళ్లలో కల్పించే సౌకర్యాలు, పిల్లలకు అందించే వస్తువులన్నీ నాణ్యంగా ఉండాల్సి స్పష్టంచేశారు. ప్రతి హాస్టల్ కిచెన్ కోసం 10 రకాల వస్తువులు కొనుగోలు చేయాలని సీఎం సమీక్షలో నిర్ణయించారు.
హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న సీఎం... మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలన్నారు. వసతిగృహాల్లో అవసరమైనంత మేర సిబ్బంది కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం 759 సంక్షేమ అధికారుల పోస్టులు, 80 కేర్ టేకర్ పోస్టులను భర్తీ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి పచ్చజెండా ఊపారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకానికీ చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్ల సమస్యలపై ఫిర్యాదు కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్, అంగన్వాడీ ఫిర్యాదుల కోసం ఇంకో నెంబర్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై ముఖ్యమంత్రి ఆరా తీయగా... అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు వివరించారు. డిసెంబర్ 1 నుంచి అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తొలుత కొన్నింట్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేసి, మూడు నెలల్లోగా రాష్ట్రమంతా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. నాడు – నేడు కింద అంగన్వాడీల్లో చేపట్టిన పనులు, అవి పూర్తయ్యాక నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలన్నారు. అంగన్‌వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న సీఎం... ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: