CM Review Meeting On Income Generated Departments : ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏ మేర లక్ష్యాలను చేరుకున్నామనే విషయమై.. సీఎంకు వివిధ శాఖల అధికారులు నివేదిక అందించారు. అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. ఆదాయార్జన పెంచాలని సీఎం జగన్ వివిధ శాఖల ఉన్నతాధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది గనుల శాఖలో 6 వేల కోట్లు, రవాణాశాఖలో 7 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది పలు శాఖల ద్వారా ఖజానాకు ఆదాయం, లక్ష్యాలను వెల్లడించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది.. ఈ ఏడాది లక్ష్యం ఎంతనే వివరాలను వెల్లడించలేదు. ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం పలు ఆదేశాలిచ్చారు.
మత్తు పదార్థాలపై దృష్టి పెట్టాలి : రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్ల కూడా ఎక్కడా అవినీతికి తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నదానిపై.. ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగులు ఉంచాలన్నారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి.. పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి.. వాటిని అమలులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలన్నారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం సూచించారు. అవినీతి నిరోధక శాఖను క్రియాశీలకంగా ఉంచాలన్న సీఎం మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలను నివారించడానికి.. వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టి పెట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ ఉంచాలన్నారు. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో.. 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్న సీఎం దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
వాణిజ్య పన్నుల ఆదాయంలో వృద్ధి: సమీక్ష సమావేశంలో ఆయా శాఖలు గత ఏడాది సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనీతీరు కనబర్చిందని సీఎంకు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25.29 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022-23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం.. 51 వేల 481 కోట్లు ఉందని 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 2023-24లో 60 వేల 191 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. లీకేజీలను అరికట్టి సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.