ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2022, 7:35 PM IST

ETV Bharat / state

తెలంగాణ తెదేపాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలి: చంద్రబాబు

Chandrababu Comments at NTR Bhavan: దేశంలో తెలంగాణ నంబర్‌ 1గా ఎదగడానికి పునాది వేసింది తెదేపా అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ తెదేపాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీలో చూస్తే తెలుగువాళ్లు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెదేపా అని వ్యాఖ్యానించారు.

Chandrababu
చంద్రబాబు

Chandrababu Comments at NTR Bhavan: తెలంగాణ తెదేపాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తెలంగాణ నంబర్‌ 1గా ఎదగడానికి పునాది వేసింది తెలుగు దేశం పార్టీనే అని పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో తెలంగాణ తెదేపా నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్.. చంద్రబాబు సమక్షంలో​ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఎన్టీఆర్​ భవన్​లో చంద్రబాబు

'తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుజాతి అభివృద్ధికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెదేపా ఉంటుంది. అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ తెదేపా. ఆర్థిక అసమానతలు పోయే వరకు తెదేపా పనిచేస్తూనే ఉంటుంది. రాజకీయాలకు కొత్త అర్థం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పాలనను పేదవాడి ఇంటిముందుకు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాను.'-చంద్రబాబు, తెదేపా అధినేత

నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెదేపా అని చంద్రబాబు అన్నారు. ఎక్కడ ఉన్నా పదవికి వన్నె తెచ్చే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో చూస్తే తెలుగు వాళ్లు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన.. భాగ్యనగరంలో ల్యాండ్‌ విలువ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు కేవలం రంగారెడ్డిలోనే 200 కళాశాలలు వచ్చాయన్నారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి నాంది పలికింది తెదేపా అని చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి నాంది వేసింది తెదేపా కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతుబిడ్డ నాగలితో పాటు... మౌస్ పట్టుకోవాలని ఆరోజే చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలకు ఒక పార్టీ ఉండాలని ప్రజలు చూస్తున్నారన్న ఆయన.. వాళ్లందరికీ తెదేపా సరైన వేదిక అన్నారు. పేదరికం, ఆర్థిక అసమానతలు పోయే వరకు తమ పార్టీ పనిచేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

చంద్రబాబు ఆదేశానుసారం తెదేపాలో చేరానని నూతనంగా నియమితులైన తెతెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆయన ఆశీస్సులతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానని పేర్కొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుందన్నారు. పార్టీకి పూర్వవైభవం రావడానికి గ్రామగ్రామాన తిరిగి కృషి చేస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి తెదేపా విజయం సాధించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details