గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేన్సర్ ఆసుపత్రిని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాట్కో ఫార్మా లిమిటెడ్ ట్రస్టు, రాష్ట్రప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దీంతో జీజీహెచ్‌లో ఇకనుంచి కేన్సర్‌కు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. నాట్కో సంస్థ 30 కోట్లు, ప్రభుత్వం తరపున 19 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేనివిధంగా 100 పడకలు కేన్సర్ రోగులకు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన కొన్ని అత్యాధునిక కేన్సర్ నిర్ధరణ పరీక్షలు జీజీహెచ్‌లో అందుబాటులోకి రానున్నాయి.
రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు అంత్యంత ఆధునిక యంత్రం లీనియర్ యాక్సిలేటర్‌ను ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ.... స్విట్జర్లాండ్ నుంచి 13 కోట్ల వ్యయంతో తెప్పించింది. ఇప్పటికే నాలుగు అత్యున్నత వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని యంత్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్ చికిత్సకు అధునాతన సదుపాయాలతో ఆస్పత్రి లేకపోవడం రోగులకు సమస్యగా ఉండేది.