ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Aayush Hospitals: ఆయుర్వేద, హోమియో వైద్యాలను ప్రజలకు కలగానే మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం

Ayurveda, Homeo Treatment Situation in AP: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అభివృద్ధి మాట అటు ఉంచితే ఉన్నవాటిని కూడా సజావుగా సాగనివ్వడం లేదు. దానికి నిదర్శనమే ఆయుర్వేద, హోమియో వైద్య రంగాలు. ఆయుర్వేద, హోమియో రంగాలకు కనీస వసతులు కల్పించ కుండా నిర్వీర్యం చేసింది. చివరికి వీటి కోసం వచ్చే కేంద్ర నిధులను కూడా సరిగా ఖర్చు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంది.

Aayush Hospitals
Aayush Hospitals

By

Published : Jul 27, 2023, 7:25 AM IST

No Minimum Facilities For Homeo and Ayurveda In Andhra Pradesh: కరోనా దెబ్బతో ప్రజల్లో సంప్రదాయ వైద్య విధానాలపై ఆసక్తి పెరిగింది. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆయుష్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రజలకు సేవలు అందించటం సులభతరం చేస్తున్నామని పదేపదే ప్రకటించే జగన్‌ సర్కారు.. ముఖ్యమైన ఆయుష్‌ ఆసుపత్రుల అభివృద్ధిని విస్మరించింది. వైద్య, ఆరోగ్య శాఖలో అంతర్బాగంగా ఉన్న ఆయుష్‌ ప్రాధాన్యం గురించి ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించే సమీక్ష సమావేశాల్లో చర్చకు వచ్చిన సందర్భాలే తక్కువే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్‌ రంగానికి వచ్చే సాయాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం సమర్థంగా ఉపయోగించడం లేదు. ఫలితంగా రోగులకు సంప్రదాయ వైద్యం కలగా మారుతోంది. ఆయుష్‌ బోధనాసుపత్రులు, వైద్యశాలల నిర్వహణలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ప్రధాన కార్యాలయం ఆడిటింగ్‌’ ద్వారా తూర్పారబట్టింది.

వైద్యులు లేరని డిస్పెన్సరీలు మూసేసిన రాష్ట్ర ప్రభుత్వం: వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మందులు అరకొరగానే ఉంటున్నాయి. నాడు-నేడు కింద ఆయుష్‌ ఆసుపత్రుల అభివృద్ధికి స్థానం కల్పించలేదు. విజయవాడ ఆయుర్వేద, గుడివాడ హోమియో వైద్య కళాశాలల్లో 56 శాతం వైద్యులు, పారా మెడికల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుర్వేద, హోమియో, యునాని రంగాల్లో కలిపి ఉన్న 7 వందల 35లో 4 వందల 20 డిస్పెన్సరీల్లో మాత్రమే వైద్యులు ఉన్నారు. 2 వందల 54 డిస్పెన్సరీలు ఇన్‌ఛార్జిలతో నడుస్తున్నాయి. 61 డిస్పెన్సరీల్లో అసలు వైద్యులే లేరు. వైద్యులు లేరన్న కారణంతో వీటిలో 4 వందల 51 డిస్పెన్సరీలను ప్రభుత్వం మూసేసింది.

నిధులు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం: ఆయుష్‌ మెడికల్‌ కళాశాలల అభివృద్థికి 2017-18 నుంచి 2021-22 మధ్య 186 కోట్ల 15 లక్షల రూపాయలను విడుదల చేయగా కేవలం 26 కోట్ల 62 లక్షలను మాత్రమే జగన్‌ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద వచ్చిన 2 కోట్ల 17 లక్షలను ఆయుష్‌ అవసరాలకు వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద కేంద్రం 2017-21 మధ్య 47 కోట్ల 42 లక్షల రూపాయలను ఇస్తే.. జగన్‌ ప్రభుత్వం కేవలం 12 కోట్ల 73 లక్షలను విడుదల చేసింది. రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన 31 కోట్ల 61 లక్షల్లో కేవలం 5 కోట్ల 72 లక్షలను మాత్రమే ఇచ్చింది.

నిధులు ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం: జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఏటా ఆయుర్వేద, హోమియో డిస్పెన్సరీల్లో అవసరమైన మందుల కోసం 2 లక్షల రూపాయల చొప్పున, హోమియో డిస్పెన్సరీలకు లక్ష వంతున నిధులొచ్చాయి. వీటిని ఖర్చు చేయడంలోనూ ప్రభుత్వం వెనుకబడింది. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు మందుల కొనుగోలుకు సరిపోవడం లేదని ప్రభుత్వం పేర్కొనడాన్ని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం అంగీకరించలేదు. 2017-18 నుంచి 2021-22 వరకు 248 కోట్ల 54 లక్షలు కావాలని ప్రతిపాదిస్తే.. కేవలం 155 కోట్లు 28 లక్షలను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 128 కోట్ల 15 లక్షలు అంటే 85శాతం మాత్రమే ఖర్చుపెట్టారు.

బహిరంగ ప్రదేశంలో వైద్య సేవలు:గుడివాడలో ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలను శిథిల భవనంలోనే నిర్వహిస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి నిధులోచ్చినా పనులు పూర్తి కాక.. పెచ్చులూడుతున్న భవనంలోనే పాఠాలు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. యూజీ, పీజీ కోర్సులు ఉన్న ఈ వైద్య కళాశాలలో తరగతి గదుల కోసం ఆయుష్‌ మంత్రిత్వ శాఖ 18 కోట్ల రూపాయలను మంజూరు చేయగా.. 2017లో భవన నిర్మాణ పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో ఓపీ ద్వారా వచ్చే రోగులకు బహిరంగ ప్రదేశంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఈసీజీ యంత్రం 2020 నుంచి పనిచేయడం లేదు.

మందుల కొరతతో తగ్గిన సేవలు: విజయవాడలో ఉన్న ఏకైక ఆయుర్వేద వైద్య కళాశాలలో మౌలిక వసతులు లేకపోవడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మందుల కొరత, వైద్య పరీక్షల నిర్వహణ జరగక రోగుల రాక గణనీయంగా తగ్గింది. గుడివాడలోని హోమియో వైద్య కళాశాల పరిస్థితి అంతే. ఆయుర్వేద బోధనాసుపత్రిలో పుట్టెడు సమస్యలు ఉన్నాయి. పాడుబడిన భవనంలో ఇది కొనసాగుతోంది. ఇక్కడ రెండేళ్ల నుంచి ఎక్స్‌రే యంత్రం పనిచేయక.. వైద్య పరీక్షలు జరగడం లేదు.

వైద్యులు వారానికోసారి.. రోగులేమో అధిక సంఖ్యలోనంట.. రాష్ట్రంలో 2 వందల 45 ఆయుర్వేద, హోమియో, యునాని డిస్పెన్సరీలు ఇన్‌ఛార్జి వైద్యులతో నడుస్తున్నాయి. వారంలో ఒకసారి మాత్రమే వైద్యులు ఈ కేంద్రాలకు వస్తుంటారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటిలో మందుల కొరత ఎక్కువే. కొందరు వైద్యులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఓపీలో ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తున్నట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details