APSRTC Higher Charges Effect on Common People: పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూశారని గత ప్రభుత్వంపై నిందలు మోపేలా సీఎం జగన్ గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. పేదలపై తనకెంతో ప్రేమ ఉన్నట్లు, వారికి ఎంతో మేలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. అదే పేదలు, సామాన్యులు అత్యధికంగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీలను మాత్రం మూడుసార్లు పెంచేశారు. ప్రజల నుంచి ఏటా 2వేల కోట్లను పిండుకుంటున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత భారీగా ఛార్జీలు పెంచలేదు. గ్రామీణులు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు బస్సులు మొదలుకొని, దూర ప్రాంత సర్వీసులతో సహా అన్నింటా రాజీలేకుండా ఎడాపెడా బాదేశారు.
విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి కిలోమీటర్‌కు సగటు బేసిక్ ఛార్జీ 76 పైసలు ఉండగా.., 2018-19లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 83 పైసలకు చేరింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కలిపి బేసిక్ ఛార్జీ 7 పైసలు మాత్రమే పెరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి కిలోమీటర్‌కు సగటున 83 పైసలు ఉన్న బేసిక్ ఛార్జీ ఇప్పటివరకు 124 పైసలుకు చేరింది. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక సగటు బేసిక్ ఛార్జీ కిలో మీటర్‌కు 41 పైసలు పెరిగింది.
బ్యారేజీ కాదు ఆర్టీసీ గ్యారేజీ! - వర్షం నీళ్లలో ఏళ్ల తరబడి మెకానిక్‌ల అవస్థలు
జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన 6 నెలలకే అంటే 2019 డిసెంబరులోనే డీజిల్ ధరలు, బస్సుల విడిభాగాలు, టైర్ల ధరలు పెరిగాయని, వీటికి తోడు ఉద్యోగుల జీతాలు భారంగా మారాయని చెబుతూ ఛార్జీలు పెంచారు. అప్పుడు ప్రయాణికులపై ఏటా 700 కోట్ల రూపాయల మేర భారం వేశారు. 2022 ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరిట రెండోసారి ఛార్జీలు పెంచారు. దీని ద్వారా ప్రయాణికులపై ఏడాదికి 720 కోట్ల మేర బాదేశారు. అప్పటివరకు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ఛార్జీ 5 రూపాయలు ఉండగా, దాన్ని10కి పెంచేశారు. రెండోసారి ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, రెండు నెలల వ్యవధిలోనే 2022 జులై నుంచి మరోసారి డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచారు. ఈ దఫా ఏటా 500 నుంచి 600 కోట్లు వడ్డించారు. ఇలా మూడు దఫాలు కలిపి ఏటా దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేరకు ప్రయాణికుల నుంచి పిండేస్తున్నారు.