Jagananna Vidya Devena Scheme: 'జగనన్న విద్యా దీవెన' కింద పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్నామని ప్రతి సభలోనూ ఆర్భాటం చేస్తున్న సీఎం జగన్.. వాటిని సకాలంలో చెల్లించడం లేదు. బీటెక్ నాలుగో ఏడాది విద్యా సంవత్సరం పూర్తయినా ఇంతవరకు ఒకే ఒక్క త్రైమాసిక ఫీజు విడుదల చేశారు. మూడు విడతలు పెండింగ్‌లో పెట్టారు. చదువు పూర్తయిన విద్యార్థులు అప్పులు చేసి, సొంతంగా ఫీజులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. 'తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. కళాశాలలను పరిశీలించి, ఫీజులు చెల్లించాలి' అని సీఎం జగన్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు డబ్బులే ఇవ్వకపోతే తల్లులు ఎలా చెల్లిస్తారు? డిగ్రీ మూడో ఏడాది ఆరో సెమిస్టర్ మరో నెల రోజుల్లో ముగియనుంది. ప్రభుత్వం మొత్తం ఫీజు ఇవ్వకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి? కళాశాలలు ఎలా కొనసాగుతాయి? అనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జగనన్న విద్యా దీవెన కింద మూడు త్రైమాసికాలకు కలిపి 9.86 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.2,096 కోట్లు చెల్లించాల్సి ఉంది.
డబ్బులిస్తేనే ధ్రువపత్రం..:ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24తో బీటెక్ నాలుగో ఏడాది ముగిసింది. స్వయం ప్రతిపత్తి కళాశాలలూ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ఇచ్చేశాయి. విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలకూ పరీక్షలు పూర్తయ్యాయి. చాలా మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఉద్యోగాల్లో చేరాలంటే కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ కావాలి. డబ్బులు చెల్లిస్తేనే ధ్రువపత్రం ఇస్తామని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరో మార్గం లేక పేదవారు అప్పులు చేసి, ఫీజులు చెల్లిస్తున్నారు. రూ.70 వేల ఫీజు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థికి ఒక్క విడతగా రూ.17,500 ప్రభుత్వం విడుదల చేసింది. కళాశాలలు ధ్రువపత్రాలు ఇవ్వాలంటే ఇప్పుడు ఒకేసారి రూ.52,500 చెల్లించాలి. ఇంత మొత్తం ఒకేసారి చెల్లించాల్సి రావడం పేదవారికి ఆర్థిక భారంగా మారింది. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీ అధికారులే విద్యార్థులను ఫీజులు అడగడంతో వారంతా ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
రూ.600 కోట్లు ఎగవేత..:ఇంజినీరింగ్‌తోపాటు ఇతర విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో నాలుగో త్రైమాసికం బోధన రుసుములను ప్రభుత్వం చెల్లించలేదు. కరోనా మహమ్మారి కారణంగా తరగతులు నిర్వహించలేదని, సుమారు రూ.600 కోట్లు ఎగవేసింది. ఆన్‌లైన్, తరగతుల్లో సిలబస్ పూర్తి చేసినందున ఫీజులు చెల్లించాల్సిందేనని యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.600 కోట్ల భారం పడింది.