Anganwadi Workers Agitation 12th Day in AP: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె పన్నెండో రోజూ సాగింది. కృష్ణా జిల్లా గన్నవరంలో అంగన్వాడీలు వినూత్న నిరసన తెలిపారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆకులు తిని బతకాలా ముఖ్యమంత్రి అంటూ నోటిలో ఆకులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో అంగన్వాడీలు భారీ మానవహారంగా ఏర్పడ్డారు. కనీస వేతనాలు మంజూరు చేసే వరకు తమ సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఉద్యోగ విరమణ అనంతరం పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. యాప్ల మోతతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వేతనం అధికంగా ఇస్తానన్న సీఎం జగన్ మాటతప్పారని అంగన్వాడీలు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీవో కార్యాలయం ఎదుట గరిటెలతో కంచాలను కొడుతూ నిరసన తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద 12 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లేట్లపై గంటలు కొడుతూ నిరసన తెలిపారు
సమస్యలతో సతమతమవుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు - పట్టించుకోని జగన్ సర్కారు
కర్నూలు జిల్లాలో అంగన్వాడీల సమ్మె పన్నెండో రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా కర్నూలులో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను ఆపబోమని హెచ్చరించారు. జగన్ సర్కారుకు తాము చేస్తున్న సమ్మె కనిపించటం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.