గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం ఎస్సీ రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి మహిళలు, రైతులు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. తహసీల్దార్, ఎంపీడీవో, సీఐలకు వినతిపత్రం ఇచ్చారు.
రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన తొలి ప్రభుత్వంగా జగన్ సర్కార్ నిలిచిపోతుందని రైతులు అన్నారు. బేడీలు వేసిన కానిస్టేబుళ్లపై చర్యలు కాకుండా.. వారిని ఆదేశించిన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.