Amaravati Capital JAC Programme: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా ధరణి కోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్ర చేపట్టాలని అమరావతి రైతులు నిర్ణయించారు. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో దిల్లీ వేదికగా ఈమేర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దాదాపు 1800మంది రైతులతో ప్రత్యేక రైలులో దిల్లీ వెళ్లనున్న అమరావతి ఐకాస.. డిసెంబర్ 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద తమ గళం వినిపించేలా కార్యక్రమం రూపొందించింది. 15వ తేదీ రాత్రికి విజయవాడ నుంచి బయలుదేరి 16వ తేదీ రాత్రికి దిల్లీ చేరుకుంటారు.
17వ తేదీన జంతర్ మంతర్లో ధర్నా చేపడతారు. 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి అమరావతి గోడు వినిపించనున్నారు. 19వ తేదీన రాంలీల్ మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొంటారు. 21వ తేదీన తిరిగి విజయవాడ చేరుకుంటామని ఐకాస నేతలు తెలిపారు.