అత్యుత్తమ నేర పరిశోధన చేసిన పోలీసులకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ అవార్డులను అందజేశారు. ఏబీసీడీ(అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) పేరిట ఏటా అవార్డులను అందచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో అత్యుత్తమ నేర పరిశోధన చేసిన పలు జిల్లాల పోలీసులకు మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అవార్డులు అందించారు.
తిరుపతి అర్బన్ పోలీసులు ఏబీసీడీల్లో ఫస్ట్ .. - tirupathi
నేరాలు ఛేదించడంలో అత్యుత్తమ పరిశోధన జరిపిన పోలీసులకు 'ఏబీసీడీ' పేరు మీద ప్రతి ఏడాది ఇచ్చే అవార్డులను డీజీపీ అందజేశారు. తిరుపతి అర్బన్ పోలీసులకు ప్రథమ, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ద్వితీయ స్థానం లభించింది.
తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయంలో కిరీటాల దొంగతనం కేసును సమర్థంగా ఛేదించినందుకు తిరుపతి అర్బన్ పోలీసులకు ఏబీసీడీ ప్రథమ అవార్డ్ లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసును సమర్థంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందికి ఏబీసీడీ ద్వితీయ అవార్డు ఇచ్చారు.
అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వేస్టేషన్ పరిధిలో ఓ మహిళ నుంచి ఆభరణాలు దొంగతనం కేసును సాంకేతిక పరిజ్ఞానం సహా ఆధునిక విధానాల్లో ఛేదించినందుకు ధర్మవరం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందికి మూడవ బహుమతి లభించింది. బ్యాగ్ దొంగతనం కేసులో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులకు నాల్గొవ బహుమతి అందించారు. దోపిడీ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు కర్నూలు తాలూకా పోలీసులకు కన్సోలేషన్ ప్రైజ్ లభించింది. విజేతలందరికీ ప్రత్యేక మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందించిన డీజీపీ ఆర్పీ ఠాకూర్.. వాళ్లు కేసులు ఛేదించిన వైనాన్ని తెలుసుకుని అభినందించారు. ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో శోధించి నకిలీ డ్రగ్స్ కేసును ఛేదించినందుకు రాష్ట్ర పోలీసులకు నేషనల్ ఇంటెలెక్చువల్ అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం గర్వకారణమని డీజీపీ అన్నారు. 2018 ఏడాదిలో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌ను జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపిక చేయడం పట్ల అధికారులను డీజీపీ అభినందించారు. 2018-19 ఏడాదిలో పోలీసు సంస్కరణలను అత్యుత్తమంగా అమలు చేసినందుకు ఏపీ పోలీసులకు భారత ప్రభుత్వం నుంచి 7.69 కోట్ల స్పెషల్ ఇన్సెంటివ్ అవార్డు లభించడం గర్వకారణమని డీజీపీ అన్నారు.