ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు.. సఫలమైన కొత్త వరి వంగడం సాగు

New Varity Paddy Seed: రైతులకు వరిసాగు కంటే.. కూలీల కొరత, ఇతర పెట్టుబడులు ప్రధాన సమస్యగా మారాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా శాస్త్రవేత్తలు సరికొత్త వంగడాన్ని కనిపెట్టారు. ఒకసారి వరి నారు పెంచి నాట్లు వేస్తే.. వరుసగా 8 సీజన్ల పాటు కోతలు కోయవచ్చు. సాధారణ పద్ధతిలో నారు పెంచి నాట్లు వేసే పద్ధతితో పోలిస్తే.. ఈ కొత్త వంగడం సాగుతో 60 శాతం నీటిని, 58 శాతం కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు.

New Verity Paddy Seed
కొత్త వరి వంగడం

By

Published : Dec 4, 2022, 2:53 PM IST

New Varity Paddy Seed: ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా నాలుగేళ్ల పాటు, 8 సీజన్లు పంట కోతకొస్తే ఆశ్చర్యమే కదా! ఇది అసాధ్యం కాదని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు. కూలీల కొరత, కూలి రేట్లు ఏటా పెరుగుతుండటం.. ఇతర ఖర్చులతో రైతులు తల్లడిల్లిపోతుండగా ఈ సమస్యలను అధిగమించే దిశగా చైనా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఒకసారి వరి నారు పెంచి నాట్లు వేస్తే వరసగా 8 సీజన్ల పాటు కోతలు కోయవచ్చు. కోత కోసిన తరవాత నీరు పెడితే అవే పిలకలపై మరోసారి పైరు పెరుగుతుంది. ఈ కొత్త వంగడాన్ని చైనా పరిశోధకులు సాగులోకి తెచ్చారు. ‘పీఆర్‌23’ పేరుతో పిలుస్తున్న ఈ వంగడాన్ని ఇప్పటికే దాదాపు 40 వేల ఎకరాల్లో చైనా రైతులు సాగుచేశారు. ఎకరానికి సగటున 27 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది.

58 శాతం కూలీల ఖర్చు ఆదా:సాధారణ పద్ధతిలో నారు పెంచి నాట్లు వేసే పద్ధతితో పోలిస్తే ఈ కొత్త వంగడం సాగుతో 60 శాతం నీటిని, 58 శాతం కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చేసే ఖర్చులో 49 శాతం వరకూ కలిసొస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. 2018లో అక్కడి రైతుల సాగుకు పీఆర్‌23 వంగడాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మరింతగా సాగుచేసి ప్రయోగాలు చేయాల్సి ఉంది.

  • చైనా అభివృద్ధి చేసిన పీఆర్‌23 వంటి వంగడాలు మనదేశంలో సాగుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించి చెప్పాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) తాజాగా దేశంలో వ్యవసాయ పరిశోధన సంస్థలను అడిగింది. రాజేంద్రనగర్‌లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ కూడా చైనా వంగడం సాగు విధానాలపై అధ్యయనం చేస్తోంది.

మన వాతావరణం, ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకోవాలి: మన దేశం సమశీతోష్ణ మండలంలో ఉంది. ప్రతి 4 నెలలకు ఒకసారి సీజన్‌ పూర్తిగా మారుతుంది. పైగా ఇటీవలి కాలంలో ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తెగుళ్లు చుట్టుముడుతున్నాయి. చైనా ఆహారపు అలవాట్లు, వాతావరణం మన దేశానికి పూర్తి భిన్నం. మనం బియ్యంతో అన్నం వండుకుని తింటాం. చైనాలో హైబ్రిడ్‌ బియ్యం లేదా నూకలతో జావలా కాచి తాగుతారు. ఈ నేపథ్యంలో మన దేశ వాతావరణం, ఇక్కడి భూములు, ఆహార అలవాట్లు.. ఇలా అన్నీ క్షుణ్నంగా పరిశీలించిన తరవాతే కొత్త వంగడాల సాగును అనుమతిస్తే మేలు. - డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధనా సంచాలకుడు, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details