POLAVARAM VICTIMS ON COMPENSATION : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని ముంపు గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంటూరి లెక్కల పేరుతో నష్టపరిహారం, పునరావాసం విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పన జరగాలన్నారు. నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్వాసితులు గొంతెత్తారు.
కాంటూరి లెక్కలతో సంబంధం లేకుండా.. పరిహారం చెల్లించాలి: కాంటూరి లెక్కల పేరుతో ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురవుతున్న కొన్ని గ్రామాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్నవారే లేరని వాపోయారు. రెండు మూడు నెలలు కొండలపై పరదాల్లో ఉండి, తాగునీటికి, ఆహారానికి సైతం అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. గిరిజనుల సాగులో ఉన్న అన్నిరకాల భూములకు భూమికి భూమి, పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 1986, 2022 వరద ముంపు ఆధారంగా రీసర్వే చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా సీఎం జగన్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 10.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు.