పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ఇప్పట్లో ప్రారంభం కానట్టే! Polavaram project works in AP: పోలవరం ప్రధాన డ్యాం పనుల ప్రారంభానికి కనీసం మరో రెండు సీజన్లు పడుతుందని ప్రాజెక్టు ఇంజినీర్లు అంటున్నారు. అదికూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెళితేనే సాధ్యమని స్పష్టంచేస్తున్నారు. పోలవరంలో ముఖ్యమైన రెండు సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట రెండు గ్యాపుల్లో 2021 వరదలకు పెద్దఎత్తున ఇసుక కోత పడి.. భూభౌతిక పరిస్థితులు మారాయి. ఇసుకలో గట్టిదనం పెంచి నేల స్వభావాన్ని పాత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. ఈ కార్యాచరణపై అధ్యయనం చేసి 2023 జనవరి 26 నాటికి కేంద్ర జల సంఘానికి, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్‌కు నివేదికలు సమర్పించాలని భావిస్తున్నారు. వాటిని పరిశీలించి ఫిబ్రవరి మొదటి వారానికి రెండు సంస్థలు నిర్ణయం ప్రకటిస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆ సంస్థల నిర్ణయం వెలువడ్డాక.. సమీప క్వారీ నుంచి ఇసుక తీసుకొచ్చి కోత పడిన ప్రదేశాల్లో నింపాల్సి ఉంది. గోదావరి గర్భంలో నుంచి నిర్మించుకుంటూ వచ్చిన డయాఫ్రంవాల్ సామర్థ్యాన్ని జాతీయ హైడ్రో పవర్ కంపెనీ తేల్చనుంది. ఈ పరీక్ష ఫలితాలు 2023 జనవరి ఆఖరుకు వస్తాయని అంటున్నారు. ఆ తర్వాత సమాంతర డయాఫ్రం వాల్‌ను ధ్వంసమైన మేర నిర్మిస్తే సరిపోతుందా, మరొకటి నిర్మించాలా అన్నది తేలుతుంది. దెబ్బతిన్న వరకు నిర్మిస్తే సరిపోతుందని ప్రస్తుతానికి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రత్యామ్నాయ పనులు 2023 మే నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో ఏర్పడ్డ మొదటి గ్యాప్‌లో 10.7 లక్షల క్యూబిక్ మీటర్లు, రెండో గ్యాప్‌లో 20.9 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. మొదటి గ్యాప్‌లో ఇసుక నింపే పని 2023 మార్చి మూడో వారానికి పూర్తయినా... వైబ్రో కాంపాక్షన్ వంటి పనులన్నీ 2023 మే చివరికి పూర్తవుతాయి. రెండో గ్యాప్‌లో ఇసుక నింపడం, వైబ్రో కాంపాక్షన్ పనులయ్యే సరికి 2023 జులై నెలాఖరవుతుంది. అంతవరకు ప్రధాన డ్యాం పనులు రెండో గ్యాప్‌లో ప్రారంభించడం సాధ్యమయ్యేలా లేవు.
నిపుణుల కమిటీ అంచనా ప్రకారం ప్రధాన డ్యాం నిర్మాణం గ్యాప్-1 ప్రాంతంలో 2023 జూన్ నాటికి ప్రారంభించవచ్చని అంచనా. ప్రధాన డ్యాం పూర్తిస్థాయి నిర్మాణానికి రెండు సీజన్లు అవసరమవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు. నిపుణులు రూపొందించిన ప్రస్తుత షెడ్యూల్‌లో ఆలస్యం కాకుండా, అవసరమైన సన్నాహాలు చేయాలని పోలవరం అథారిటీ సూచించింది. ప్రస్తుతం పోలవరం దిగువ కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల.. ప్రధాన డ్యాం నిర్మించే చోట వరద చేరింది. అక్కడ నీటిమట్టాన్ని +13 మీటర్ల స్థాయికి తగ్గించేలా నీటిని ఎత్తి పోయాల్సి ఉంది. ఈ పని పూర్తి చేయడానికి నవంబరు నెలాఖరు అవుతుందని భావిస్తున్నా... మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జులై నాటికి పూర్తి చేయాల్సిన దిగువ కాఫర్ డ్యాంను... వచ్చే జనవరికి పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తిచేస్తే వచ్చే వరద సీజన్ నాటికి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో నీటి అడ్డంకులు లేకుండా పనులు చేసేందుకు వీలు కలుగుతుంది.
ఇవీ చదవండి: