Formula E-Race In Hyderabad : ఫార్ములా- ఈ రేస్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన రేసుల్లో ఇదొకటి. విదేశాల్లో దీని గురించి అధిక శాతం మందికి తెలుసు. మన దేశంలో ఈ రేసుపై పెద్దగా అవగాహన లేదు. ఇది కార్ల రేసు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ) అనే సంస్థ ఈ పోటీని నిర్వహిస్తోంది.
అసలేంటీ ఫార్ములా - ఈ రేసు...?70 ఏళ్ల క్రితం ఫార్ములా-1 పేరుతో అంతర్జాతీయంగా కార్ రేస్ పోటీలు జరుపుతోంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో జరిగేది ఫార్ములా-ఈ రేసు. ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేసింగ్ తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది. మొదటి సారి ఈ రేసు చైనాలోని బీజింగ్‌లో 2014లో జరిపారు. ఇండియాలో ఈ రేసింగ్ జరగడం ఇదే మొదటి సారి. అది కూడా హైదరాబాద్ నగరంలో జరగడం విశేషం. దీనికి ముందు ఫార్ములా-1 రేసు దిల్లీ లో జరిగింది.
ఫార్ములా -1 కి, ఫార్ములా - ఈ రేసుకు తేడా ఏంటి..ఫార్ములా-1 రేసులో కార్లు పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలతో నడుస్తాయి. అదే ఫార్ములా-ఈ మాత్రం ఎలక్ట్రికల్ కార్లు వినియోగిస్తారు. రెండింటికీ ఇదే ప్రధాన తేడా. ఫార్ములా-1 రేసు కోసం ప్రత్యేక ట్రాక్‌లను తయారు చేస్తారు. దీన్ని సర్య్కూట్ అంటారు. రేస్ జరిగే సమయంలో ఇంజిన్ సమస్యలు, కారు టైర్లను మార్చడానికి ట్రాక్ మధ్యలో అక్కడక్కడ స్టాప్స్ సైతం ఏర్పాటు చేస్తారు. వీటిని మూడు రోజుల పాటు జరుపుతారు.