Polavaram Right Canal Water Supply: జులై నెల ప్రారంభమై వారం దాటినా ప్రభుత్వం పట్టిసీమకు నీరు వదలకపోవడంతో పోలవరం కాలువ మీద ఆధారపడి ఖరీఫ్‌లో సాగుచేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపాదడపా జల్లులు పడుతుండటంతో ఇప్పటికే మైలవరం, గన్నవరం, నూజివీడు, ఇతర నియోజకవర్గ రైతులు ఖరీఫ్ సాగుకు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసుకున్నారు. పట్టిసీమపై ఆధారపడి ఏటా జిల్లాలో 9,861 హెక్టార్లలో రైతులు నారుమళ్లు వేస్తారు. జులై నెల వచ్చినా కూడా కాలువలకు నీరు రాకపోవడంతో నారుమడులు వేస్తే సాగునీటి పరిస్థితి రైతులను కలవర పెడుతోంది.
మరోవైపు నియోజకవర్గాల్లోని ఊర చెరువులు కూడా మండుటెండలకు నీటిమట్టం తగ్గి పూర్తిగా ఖాళీ అయ్యాయి. దీంతో ఖరీఫ్ సాగుకు నారుమడులు వేస్తే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొని వర్షాలు పడితేనే నీళ్లు అనే పరిస్థితి తలెత్తుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువకు నీరు వదిలితే తమకు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ పోలవరం కుడి కాలువ వచ్చిన తర్వాతే తమకు పంటలు పండుతున్నాయని రైతులు తెలిపారు. గత సంవత్సరం కూడా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేశారని, మరి ఈ సంవత్సరం ఎందుకు నీటిని విడుదల చేయడం లేదో అర్థంకావడం లేదని రైతులు అంటున్నారు.
Kandaleru Reservoir: నెల్లూరు కనుపూరు కాలువల్లో ఆగిన సాగునీరు..అన్నదాతకు కన్నీరు
పోలవరం కాలువకు నీటి విడుదల విషయాన్ని ఇప్పటికే గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు, మైలవరం, విజయవాడ రూరల్ మండల రైతులు.. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పట్టిసీమ నీటి విడుదల సమస్య పరిష్కారంపై అధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. జిల్లాలో అత్యధికంగా 2.35 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా నీటి లభ్యత అరకొరగా ఉండటం ఇబ్బందికరంగా మారింది.
ప్రభుత్వం సాగు నీరు ఇస్తుందో లేదో అనే అనుమానంతో చాలా మంది రైతులు ఇంకా ఆకుమడులను కూడా పోయలేదు. కాలువకు నీరు రాకపోవడంతో ఆకు మడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలని అదును తప్పితే వ్యవసాయం చేయలేమని రైతులు పేర్కొన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వరినాట్లు వేస్తున్నారని.. కానీ తాము ఇంకా నారుమళ్లు కూడా పోయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పోలవరం కుడి కాలువకు త్వరితగతిన నీరు విడుదల చేయాలని కోరుతున్నారు.
RAJOLI RESERVOIR: కదలిక లేని రాజోలి, జొలదరాశి జలాశయాల పనులు.. భూమి సేకరించినా..
గతేడాది 1.07లక్షల హెక్టార్లలో మాత్రమే వరి పంట సాగు చేశారు. పట్టిసీమ నీరు ఆలస్యమైతే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు శాతం మరింత తక్కువయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పోలవరం కుడి కాలువకు వచ్చే నీటినే తాము సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటామని రైతులు తెలిపారు. గతంలో కాలువ లేని సమయంలో ఈ ప్రాంతంలో ఒక సంవత్సరం పంటలు పండితే మరోక సంవత్సరం పంటలు సరిగా పండేవి కాదని గుర్తుచేసుకున్నారు. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోయేవారమని రైతులు వివరించారు. సాగునీరు లేకపోతే ఈ ప్రాంతలో వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి ఉండదని చెబుతున్నారు.
"గత సంవత్సరం జూన్‌లో ప్రభుత్వం పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేసింది. సాగునీరు లేకపోవడంతో మేము పంటలు ఎలా పండిచాలో తెలియక ఇబ్బంది పడుతున్నాము. అసలు సాగునీటికి నీటిని విడుదలు చేస్తారో లేదో కూడా అధికారులు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదు. ఆకుమడులు పోసినా కూడా తడుపుకు నీరు లేక నాట్లు వేయలేదు. దీనివల్ల వ్యవసాయం ముందుకు సాగటంలేదు." - రైతుల ఆవేదన
ప్రభుత్వం పోలవరం కాలువ ప్రాంతాల్లో ఉన్న రైతులను దృష్టిలో ఉంచుకొని సత్వరమే పట్టిసీమకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. సాగునీరు ఇస్తే రైతులు పంటలు పండించి దేశానికి అన్నం పెడతారని, ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు.