మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తెదేపా సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెదేపాకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కక్షసాధింపు చర్యల వల్లే కోడెల శివప్రసాదరావు మరణించారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై రాజకీయ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ మరణం సంభవించిందని మాజీ హోంమంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన పరిణామాలు ఆయన్ని మానసికంగా దెబ్బతీశాయని రాజమహేంద్రవరంలో అన్నారు.
'కోడెల మరణం రాష్ట్రానికి తీరని లోటు'
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని తెదేపా సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లే ఆయన మరణించారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
రాజకీయాల్లో తనదైన ముద్ర
కోడెల శివప్రసాదరావు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పేదలకు వైద్యుడిగా విశేష సేవలందించారని కొనియాడారు. ఇటీవల పరిణామాలపై తన వద్ద అనేకసార్లు బాధ పడ్డారని తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పితాని సత్యనారాయణ కూడా కోడెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవలి పరిణామాలతో కోడెల మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు. ఆయన మృతి తనకు తీరని లోటని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ప్రభుత్వ వేధింపుల కారణంగానే.. కోడెల ఇలా: సోమిరెడ్డి