మొదటి విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఐ సురేష్ బాబు, ఎస్సై రామకృష్ణకు కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రత్యేక బలగాలతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రంపచోడవరం వచ్చారు. ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎర్రంపాలెం ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. ఏజెన్సీలో సీఆర్పీఎఫ్, ఏఎన్ఎస్ బలగాలతో పటిష్టమైన భద్రతను నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
పోలీసుల కవాతు
తొండంగి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. అదనపు ఎస్పీ కరణం కుమార్ అధ్వర్యంలో డీఎస్పీలు, సీఐ, ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని, వివాదాల జోలికి వెళ్ళొద్దని కోరారు.