ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన ఆక్సిజన్‌ నిల్వల సరఫరా.. జీజీహెచ్‌లో మరోట్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు - oxygen production division at east godavari

రాజమహేంద్రవరం వైద్యం కరోనా ఉద్ధృతి వేళ అత్యవసర బాధితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్నిచోట్ల ప్రాణవాయువు అందక తల్లడిల్లుతున్నారు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ తక్కువ కావడం.. వినియోగంలో అవగాహన లోపం.. అవసరం లేకున్నా ప్రాణవాయువు వాడకం సమస్యగా మారుతోంది. పలువురు బాధితులకు ఆక్సిజన్‌ స్థాయి తగ్గి.. ఐసీయూ ఆక్సిజన్‌ పడకలు అవసరం అవుతున్న నేపథ్యంలో ఉన్న పడకలన్నీ నిండిపోతున్నాయి. యంత్రాంగం అప్రమత్తమై..ఉన్న నిల్వలనే సమర్థంగా వినియోగించేలా చేయాల్సిన కీలక తరుణమిది.

Oxygen Production Division at Kakinada GGH
Oxygen Production Division at Kakinada GGH

By

Published : May 4, 2021, 4:12 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో వైద్యశాలలకు 74 కిలో లీటర్ల ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం కొరతతో జిల్లాకు కేవలం 35 కిలో లీటర్లు మాత్రమే రోజుకు సరఫరా అవుతోంది. తూర్పున ఉత్పత్తి కేంద్రాలు లేకపోవడంతో విశాఖ స్టీల్‌ప్లాంటు, ఒడిశాలోని అంగూర్‌ నుంచి తెప్పిస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమలు, కర్మాగారాల అవసరాలకు కేటాయించాల్సిన సరఫరానూ ఆపేశారు.

ఆక్సిజన్‌ బెడ్ల అవసరం పెరగడంతో డిశ్ఛార్జిలపై దృష్టిసారించారు. అవసరం లేకున్నా సిలిండర్లు వాడటం, ఆరోగ్యం నిలకడగా ఉన్న కేసులను మరోచోటుకు మార్చడం, లేదంటే డిశ్ఛార్జి చేసి.. మిగిలిన ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఆసుపత్రుల్లో వాస్తవస్థితిపై కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్‌ డీప్‌ డ్రైవ్‌ చేపట్టారు. బృందాలు తనిఖీ చేసి... ఆక్సిజన్‌ వ్యవస్థ, పడకల పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు.

10 శాతం కంటే తగ్గిన వృథా

మెడికల్‌ ఆక్సిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఆక్సిజన్‌ మానిటరింగ్‌ సెల్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రులకు సరఫరా పర్యవేక్షణ బాధ్యత జేసీ లక్ష్మీశకు అప్పగించారు.

గతంలో జిల్లాలో ఆక్సిజన్‌ వృథా 40 శాతం ఉంటే.. ఇప్పుడది పది శాతం కంటే తగ్గించారు. పైపులైన్ల లీకేజీలతో కొంత.. రోగులు కాలకృత్యాలకు వెళ్లినప్పుడు వృథాగా పోవడంతో మరికొంత.. ఎక్కువ సేపు ఆక్సిజన్‌ పెట్టుకుని ఉంచలేని పరిస్థితుల్లో తీసి పక్కన పెట్టడంతో మరికొంత వృథా అవుతున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా ఈ తరహా వృథాను పరిశీలించి ఎప్పుటికప్పుడు ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు.

సాంకేతికంగా సరిదిద్దితేనే..

జీజీహెచ్‌లో 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 10 నుంచి 14 వేల లీటర్లు వాడుతున్నారు. వినియోగం పెరిగి ట్యాంకు సగానికి ఖాళీ అవడంతో ఫ్లో తగ్గుతోంది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇటీవల ప్రారంభించిన వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని అత్యవసర సమయంలో వాడేందుకు సిద్ధంగా ఉంచారు.

రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న ట్యాంకుల మొత్తం సామర్థ్యం 16 కిలో లీటర్లు. ఈ రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకుల ద్వారా రోజువారీ 8.8 కి.లీ. వినియోగిస్తున్నారు. ఇక్కడున్న ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు నిండిపోవడంతో వినియోగం పెరిగింది. అవసరానికి తగ్గ నిల్వలు అందుబాటులో ఉంచి.. సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారానికి నిపుణులను నియమించాల్సి ఉంది.

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..

జిల్లాలో ఆక్సిజన్‌ వినియోగం రోజుకు 40 నుంచి 45 కిలో లీటర్లు ఉంటే.. సరఫరా అవుతున్నది 35 కి.లీ. మాత్రమే. ట్యాంకుల్లో ఉన్న రిజర్వు నిల్వలను జాగ్రత్తగా వాడుతున్నాo. ఆరోగ్యం నిలకడగా ఉండి.. కోలుకున్న వారిని బొవ΄్మరు, బోడసకుర్రులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నాo. ఆ బెడ్లు అత్యవసరమైన వారికి కేటాయిస్తున్నాం. ఆక్సిజన్‌ వృథాను 45 శాతం నుంచి పది శాతం కంటే తక్కువకు తగ్గించాం. మానిటరింగ్‌ కమిటీ ద్వారా పరిస్థితి పర్యవేక్షిస్తునాం. - లక్ష్మీశ, జేసీ (కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ)

కొవిడ్‌ వైద్యశాలల్లో వసతులు ఇలా..

కరోనా సేవల ఆసుపత్రులు : 76

ఆసుపత్రుల్లో పడకలు : 4,461

(ఐసీయూ: 788, ఆక్సిజన్‌ బెడ్లు: 2,328, సాధారణ: 1,345)

తాజాగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు : 43

మొత్తం పడకలు : 645

(ఐసీయూ: 215, ఆక్సిజన్‌: 430)

ఇదీ చదవండి:

తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details