ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారుధులే వాలంటీర్లు - east godavari
ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేర్చటమే వాలంటీర్ వ్యవస్థ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులే వాలంటీర్లని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేర్చడమే ఈ వ్యవస్థ లక్ష్యమని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే అధికారులకు రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. జన్మభూమి కమిటీలకు.. వాలంటీర్లకు పోలికలేదని స్పష్టం చేశారు. వారికి నెలకు 5వేలు భృతి ఇస్తున్నామని... కేవలం 50కుటుంబాలకే పరిమితం చేస్తున్నామని వెల్లడించారు. వాలంటీర్ల పనితీరును నేరుగా సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే 48గంటల్లో వారిని తప్పించి కొత్తవారిని నియమిస్తామన్నారు. మొదట్లో కొంత ఎక్కువ సమయం పట్టినా.. తర్వాత వాలంటీర్లు రోజుకి గంటసేపు కేటాయిస్తే చాలు 50కుటుంబాల సమాచారం తెలుస్తుందన్నారు. వారి విధులపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. ఈ నెల 5నుంచి 12వరకూ మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో మండలం నుంచి ఆరుగురు అధికారులను ఎంపిక చేశారు. వారికి రెండు రోజులపాటు జడ్పీ సమావేశ మందిరంలో 53 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.