తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ కారణంగా.. 28 రోజులపాటు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని అమలాపురం ఆర్డీవో భవానిశంకర్ వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే సరకుల దుకాణాలను తెరవటానికి అనుమతిస్తామన్నారు. మందుల దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలు మూసివేస్తామని వివరించారు.
ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి కలిసి ఉంటే క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. మాస్కు పెట్టుకోకపోతే రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. బ్యాంకులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఖాతాదారులకు సేవలు అందిస్తాయన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు.