ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీకల్లోతు కష్టాల్లో కౌలు రైతులు.. పెట్టుబడి దక్కని దైన్యం

వరస విపత్తులకు కౌలు రైతులు చిత్తయ్యారు. ఖరీఫ్‌ సాగు మొదలు నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. చివరికి మిగిలిందన్నా.. ఒబ్బిడి చేసుకుందామని తలస్తే... వారి ఆశలను ‘నివర్‌’ తుపాను అడియాశ చేసింది. కౌలు ఎంతివ్వాలో.. ఏం తినాలో తెలియని దయనీయం.

Lease farmers lossed crop
పీకల్లోతు కష్టాల్లో కౌలు రైతులు

By

Published : Dec 2, 2020, 8:14 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో 5.90 లక్షల మంది రైతులు 2,19,209 హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు చేశారు. వీరిలో 4.70 లక్షలకు పైగా కౌలు రైతులే ఉన్నారు. వీరిలో రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీ) పొందింది కేవలం 1.65 లక్షల మంది మాత్రమే. అంటే 40 శాతం మంది కూడా పంట రుణాలు పొందలేదు.

తూర్పు, మధ్య, మెట్ట ప్రాంతాల్లో అక్కడ పరిస్థితుల మేరకు ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు (ఖరీఫ్, రబీ పంటలకు) శిస్తు చెల్లించే ఒప్పందంతో కౌలుకు సాగు చేశారు. ఎల్‌ఈసీ కార్డులు లేకపోవడంతో ప్రస్తుతం వరి దెబ్బతిన్నా.. ప్రభుత్వం అందించే పరిహారానికి నోచుకోవడం లేదు.

తిజిల్లాలో 72 వేల హెక్టార్లకు పైగా పంటనష్టం అంచనా వేయగా 30 వేల హెక్టార్లలోపే పరిహారం వచ్చింది. భారీ వర్షాలు, ఏలేరు వరదలకు 29 వేల హెక్టార్ల నష్టం గుర్తించి.. 78,042 మందికి రూ.44.42 కోట్లు విడుదల చేశారు. ఇందులో కౌలు రైతులకు దక్కింది 5 శాతవ΄ లేదు. తాజా నష్టాల్లోనూ వారికి పరిహారం అందేలా లేదు.

కోలుకోలేని నష్టం
15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. ఎకరాకు 28 బస్తాలు శిస్తు చెల్లించాలి. గింజ గట్టిపడే దశలో ఎండాకు తెగులు, అధిక వర్షాలతో పంట దెబ్బతింది. ఇప్పుడు భారీవర్షాలకు కోలుకోలేని నష్టం ఏర్పడింది. ఐదెకరాల్లో పంట కోసి ధాన్యం రాశి పోస్తే.. మొత్తం తడిసి మొలకలు వచ్చాయి. ఇక మిగిలిన 10 ఎకరాలు నేలవాలి దెబ్బతింది. - ఎం.పెద్దిరాజు, కౌలురైతు, ఊడివ΄డి

3.5 ఎకరాలు.. 30 బస్తాలు
మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నా. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తున్నా. ఆగస్టులో వరదలకు నారుమళ్లు పోతే మళ్లీ నారు తెచ్చి నాట్లు వేశాం. తర్వాత రెండుసార్లు భారీ వర్షాలకు పంట పొట్టదశలో ముంపునకు గురైంది. చేను చూడమన్నా అధికారులు పట్టించుకోలేదు. మాసూలు చేస్తే.. 30 బస్తాల దిగుబడి కూడా రాలేదు. అసలు రైతుకు ఎంతివ్వాలో? అప్పుల పరిస్థితి? రబీ పెట్టుబడి ఆలోచిస్తుంటే నిద్రపట్టడం లేదు. - మేడిశెట్టి భద్రం, కౌలురైతు, కొత్తలంక

తుడిచి పెట్టేసింది..
సెప్టెంబరు, అక్టోబరులో భారీ వర్షాలకు వరి సాగులో పంట నష్టాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో తిరిగి నమోదు చేశారు. ముంపు నీరు తీశాక క్షేత్రస్థాయికి వెళ్లిన వీరు వరిచేలు పడిపోకుండా నిలబడి ఉన్నాయనే.. అంశాన్ని పరిశీలించి వాటిని నష్టం అంచనాల్లో నమోదు చేయలేదు. పొట్ట, ఈనిక దశల్లో వరిచేలు ముంపునకు గురికావడంతో గింజలు పాలు పోసుకోక నష్టం వాటిల్లింది. దీనికి తోడు ‘నివర్‌’ ప్రభావంతో అవి కూడా ముంపు బారినపడి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

పరిహారం.. యజమానులకే
ఎక్కడైనా మెరక ప్రాంతాల్లో పంటలను మాసూలు చేసినా.. ఎకరాకు 10-15 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. ఖరీఫ్‌లో వ్యవసాయ శాఖ పరిగణన మేరకు ఎకరాకు 30-32 బస్తాల దిగుబడి అంచనా లెక్కన చూసినా.. 60 శాతానికి పైగా రైతులు పంటలను నష్టపోయినట్లే. ఈ తరుణంలో రైతులకు సాయం అందకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పరిహారం భూయజమానులకే ఇవ్వడంతో తమకు నష్టం మాత్రం మిగులుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట పూర్తిగా నష్టపోయా
16 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. రెండెకరాలు మినహా మిగిలింది ఎక్కడా కోత కోయకుండా చేలోనే ఉంది. కోసిన రెండెకరాలు కూడా.. ఎకరాకు 10 చొప్పున 20 బస్తాలు అయ్యాయి. రూ.4 లక్షలు వరకు పెట్టుబడి పెట్టా. పూర్తిగా నష్టపోయా. పంట నష్టం అంచనా వేయలేదు. ఒక్క రూపాయి అందలేదు. అసలు రైతుకు శిస్తు ఎలా ఇవ్వాలి? రబీ సాగుకు ఎలా సన్నద్ధం కావాలి? - సత్యనారాయణ, కౌలురైతు, కొత్తలంక

ప్రతి కౌలు రైతుకూ న్యాయం
గతంలో 16 వేల మంది కౌలు రైతులకు మాత్రమే రుణ అర్హత కార్డులు ఉంటే.. ఆ సంఖ్యను 1.10 లక్షలకు పెంచాం. ఈ సీజన్‌లో మిగిలిన వారికీ జారీ చేస్తాం. విపత్తులకు వరి దెబ్బతిని, ధాన్యం తడిసి నష్టపోయిన రైతుల్లో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు. ఈ- క్రాప్‌లో అందరినీ కవర్‌ చేశాం. గతంలో పట్టాదారు ఆధార్, మొబైల్‌ లింక్‌ చేస్తే.. ఈ-క్రాప్‌లో క్షేత్రస్థాయిలో పంట పండించే వారినే నమోదు చేశాం. రైతు భరోసా కేంద్రాల్లో ఆయా కౌలు రైతుల బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్‌తో నమోదైతే పరిహారం, ధాన్యానికి మద్దతు ధర కౌలు రైతుకే అందుతుంది. ఈ-క్రాప్‌లో నమోదు కాలేదనే పరిస్థితి జిల్లాలో లేదు. ఇంకా అలాంటివారు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం. ఇప్పటికి 80 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మంగళవారం ఒక్కరోజే 13,700 మెట్రిక్‌ టన్నులు కొన్నాం. తడిసి, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు మిల్లర్లతోనూ సమావేశం నిర్వహించాం.

ఇవీ చూడండి...

'భూకొనుగోళ్లపై ఆధారాలతోనే కేసులు....దర్యాప్తు కొనసాగనివ్వండి'

ABOUT THE AUTHOR

...view details