సికింద్రాబాద్ ఏఎస్ రావు నగర్లోని హానీఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు ప్రతి ఏడాది.. 21 కిలోల లడ్డూను తయారుచేసి బాలాపూర్ గణేశుడికి ప్రసాదంగా అందిస్తారు. అయితే ఈ సారి తిరుమల లడ్డు అంత రుచిగా ఉండేలా బాలాపూర్ గణేశుడికి లడ్డూను తయారు చేసిన ఉమామహేశ్వరరావు దంపతులు.. మేళ తాళాల మధ్య ఊరేగింపుగా లడ్డూను బాలాపూర్ తీసుకెళ్లారు.
గత పదిహేనేళ్లుగా భక్తి శ్రద్ధలతో మాల ధరించి ఎంతో నిష్ఠతో లడ్డూ తయారీ చేపడుతున్నాం. శనగపిండి మర పట్టించకుండా స్వయంగా ఆడించి పిండి చేస్తాం. ఆ పిండిలో పాలు కలిపి.. సుగంధ ద్రవ్యాలను జోడించి తయారు చేస్తాం. లడ్డూ తయారీ కోసం ప్రత్యేకంగా చక్కెర తెప్పిస్తాం.
మొదటిసారి మేము బాలాపూర్ లడ్డూ తయారీని దక్కించుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇచ్చాం. అప్పుడు అసంతృప్తిగా అనిపించింది. ఇంకా స్టీలు, ఇత్తడి, పంచలోహాలతో తయారుచేసిన పాత్రల్లో పెట్టి ఇచ్చాం. కొన్నేళ్లుగా వెండి పళ్లెంలో పెట్టి ఇస్తున్నాం. అది కూడా తృప్తినివ్వలేదు. ఎప్పటికైనా బంగారు పళ్లెంలో పెట్టి ఆ గణనాథుడికి లడ్డూ ఇవ్వాలని మా కోరిక. పదిహేనేళ్లుగా బాలాపూర్ గణనాథుడికి లడ్డూను అందించడం అదృష్టంగా భావిస్తున్నాం. బాలాపూర్ లడ్డూకు ఒక ప్రత్యేకత ఉండేలా.. ఈసారి తిరుమల తిరుపతి లడ్డూ రుచితో ఈ ప్రసాదాన్ని తయారు చేశాం. స్వామి ఆశీస్సులతోనే మేము ప్రతి యేటా లడ్డూను అందించగలుగుతున్నాం.-ఉమామహేశ్వరరావు, హనీఫుడ్స్ అధినేత, బాలాపూర్ లడ్డూ తయారీదారు