Chandrababu Tour in Tensions : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు మూడో రోజు పర్యటన ఉద్రిక్తంగా సాగింది. పోలీసుల ఆంక్షలు.. చంద్రబాబు అనపర్తి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా పోలీసులు రోడ్డుపై వాహనాలు పెట్టడం.. రోడ్డుపై బైఠాయించడంతో చంద్రబాబు కాలినడకనే 8 కిలోమీటర్లు నడిచి అనపర్తి చేరుకున్నారు. చంద్రబాబుతో టీడీపీ శ్రేణులు నడిచారు. మధ్యలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా ఆగకుండా చంద్రబాబు అనపర్తి చేరుకున్నారు.
సామర్లకోట నుంచి అనపర్తికి బయల్దేరిన చంద్రబాబును బలభద్రపురం దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా లారీలను, పోలీసు వాహనాలను నిలిపి ఉంచారు. అంతేకాకుండా కానిస్టేబుళ్లను.. చంద్రబాబు వాహన శ్రేణికి అడ్డంగా పోలీసు అధికారులు కూర్చోబెట్టారు. దీనికి నిరసనగా ఆయన కాన్వాయ్‌ను వదిలి కాలినడకన బలభద్రపురం నుంచి అనపర్తికి బయల్దేరారు.
కాలినడకన బయల్దేరిన తర్వాత చంద్రబాబు సుమారు గంట 15 నిమిషాలు ఆగకుండా 8 కిలోమీటర్లు నడిచారు. ఆయనను పోలీసులు అడ్డుకునేందుకు పోలీసులు బస్సులను అడ్డుగా ఉంచారు. వాటిని పక్కకు నెట్టి టీడీపీ శ్రేణులు చంద్రబాబును ముందుకు నడిపించాయి. ఈ క్రమంలో ఆయన పాదయాత్రగా అనపర్తికి వెళ్తున్న క్రమంలో రోడ్డు చీకటిగా ఉన్న సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో నడుచుకుంటూ అనపర్తికి చేరుకున్నారు. అనపర్తికి చేరుకున్న అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు.
సుమారు 7 కిలో మీటర్ల దూరం నడిచి అనపర్తికి వచ్చాను. అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించానన్నారు. నేను పాకిస్థాన్ వచ్చానా.. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎన్నో అవమానాలు భరించి అనపర్తికి వచ్చాను. అనపర్తి వచ్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన అనుమతిని పోలీసులు ఎప్పుడైనా రద్దు చేస్తారట.. జగ్గంపేట, పెద్దాపురం పోలీసులు ఆయనకు సహకరించారు. ఖబడ్దార్.. గ్రావెల్ సూర్యనారాయణ.. జాగ్రత్తగా ఉండు.. భావితరాల భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నా. ఈ సైకో సీఎం.. పోలీసుల మెడపై కత్తిపెట్టారు. కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదు. -చంద్రబాబు
అధికారంలోకి వచ్చాక చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ సమీక్ష చేస్తాం. అక్రమాలకు పాల్పడిన పోలీసులనూ వదిలిపెట్టను.సీఎం కావాలని నేను పోరాటం చేయడం లేదు. జగన్ పాదయాత్రను మేం ఎప్పుడైనా అడ్డుకున్నామా.. అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు. మాజీ సీఎంపై పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదు. అరాచకాలను అడిగేవాళ్లే ఉండకూడదని అనుకుంటున్నారు.. వైసీపీ పాలనలో అన్ని పన్నులు పెరిగాయి. -చంద్రబాబు