ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీఎంఆర్‌ డ్రెడ్జింగ్‌ పనుల నిలిపివేత

మడ అటవీ ప్రాంతంలో తవ్వకాలపై అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయటంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శివారు కుంభాభిషేకం ప్రాంతంలో జీఎంఆర్‌ ఎనర్జీ లిమిటెడ్‌ చేపడుతున్న డ్రెడ్జింగ్‌ పనులను ఆపేశారు. ఈ పనులతో మడ అడవులు, అక్కడున్న జీవరాశులకు హాని కలుగుతుందని స్థానికుల నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు అటవీశాఖ, పీసీబీ అధికారులు ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

జీఎంఆర్‌ డ్రెడ్జింగ్‌ పనుల నిలిపివేత
జీఎంఆర్‌ డ్రెడ్జింగ్‌ పనుల నిలిపివేత

By

Published : Jun 1, 2020, 7:35 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శివారు కుంభాభిషేకం ప్రాంతంలో జీఎంఆర్‌ ఎనర్జీ లిమిటెడ్‌ చేపడుతున్న డ్రెడ్జింగ్‌ పనులను ఆపేయాలని అటవీశాఖ ఆదేశించింది. ఈ పనులతో మడ అడవులు, అక్కడున్న జీవరాశులకు హాని కలుగుతుందని స్థానికుల నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు అటవీశాఖ, పీసీబీ అధికారులు ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ గట్లు నిర్మిస్తే భవిష్యత్తులో మడ అడవికి హాని కలుగుతుందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

కాకినాడ తీరంలో జీఎంఆర్‌ సంస్థ గతంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటుచేసింది. రిలయన్స్‌ గ్యాస్‌ అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో మంగళూరులో ఉన్న ఈ ఫ్లోటింగ్‌ పవర్‌ ప్లాంటును ఇక్కడకు తరలించారు. కానీ గ్యాస్‌ కొరతతో 2011లో ప్రాజెక్టును మూసేశారు. ప్రస్తుతం దీన్ని వేరే యాజమాన్యానికి విక్రయించారు. బార్జిపై ఉన్న పవర్‌ ప్లాంటును పోర్టు వరకు కాలువ ద్వారా తరలించి.. అక్కడి నుంచి సముద్రమార్గంలో గల్ఫ్​కు పంపాలని భావించారు. ఇందుకు పోర్టు నుంచి ఫిబ్రవరి 1న అనుమతులు పొంది ఇటీవల ఛానల్‌ తవ్వకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గట్లు ఏర్పాటుచేశారు.

జీఎంఆర్‌ డ్రెడ్జింగ్‌పై ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. మడ సంపద ఉన్న ప్రాంతం చుట్టూ గట్టు ఏర్పాటుతో నీటి ప్రవాహం తగ్గుతుందన్న ఉద్దేశంతో ఆ గట్టు తొలగించాలని ఆదేశించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి నందనీ సలారియా చెప్పారు. అక్కడ నల్లని నీరు వస్తుండటంతో ఆ నీటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా..? అనే కోణంలో నమూనాలు సేకరించి ఆరా తీస్తున్నామని తెలిపారు.

పనులన్నీ ఆపేశాం: జీఎంఆర్‌ ఎనర్జీ

పోర్టు అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకున్న తర్వాతే.. బార్జిపై ఉన్న పవర్‌ ప్లాంటును పోర్టు ప్రాంతం నుంచి తరలించేందుకు నావిగేషనల్‌ ఛానల్‌ డ్రెడ్జింగ్‌ ప్రారంభించినట్లు జీఎంఆర్‌ ఎనర్జీ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే ప్రభుత్వ అధికారుల సూచనతో పనులు ఆపేశామని, ప్రస్తుతం అక్కడ ఎలాంటి డ్రెడ్జింగ్‌ కార్యకలాపాలు జరగడం లేదని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details