ఓవీధిలోకి వెళితే సీతారామలక్ష్మణులు, వారిని కీర్తిస్తూ వానర వీరులు కనిపిస్తారు. ఈ సందోహాన్నుంచి బయటపడి మరో వీధిలోకి అడుగు పెడితే... గోపికలతో సరసమాడే శ్రీకృష్ణుడి దర్శనమవుతుంది. రామకృష్ణులే కాదు, ఎందరో పురాణ పురుషులు ఆ గ్రామంలో కనిపిస్తారు. నృత్యగాన వాక్ పటిమలతో మైమరపిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నంలో ఏటా జరిగే మోదుకొండమ్మ తల్లి జాతరి వైభవం ఇది. సుమారు 500 కు పైగా కుటుంబాలు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొంటాయి. ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా విభిన్న వేషాలతో వేడుకకు తరలివస్తారు.
జాతర వస్తే... ఆ గ్రామం రంగస్థలమే! - artists
జాతర అంటే డప్పుల మోతలు, నైవేద్యాలు, ఊరేగింపులు ఇలాంటివి గుర్తొస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం జాతర వస్తే... అందరూ రంగస్థల నటుల్లా మారిపోతారు. పురాణ పురుషుల వేషధారణలతో అలరిస్తారు. నృత్యాలు, పాటలు, డైలాగులు ఇలా తమలోని ప్రతిభను వెలికితీస్తారు. కళారాధనతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు
జాతరలో వేషధారణలు
పురాణ పురుషుల వేషధారణల వెనుక ఓ నేపథ్యం ఉంది. కోరిన కోర్కెలు తీరినవారంతా ఇలా విభిన్న రూపాల్లో కనువిందు చేస్తారు. ఈ పాత్రల్లో రామలక్ష్మణుల వేషధారణ ప్రత్యేకం. అందరూ ఆ వేషాలు ధరించరు. రామలక్ష్మణుల వేషధారణ కోసం 6 నెలల ముందుగానే గ్రామంలో వేలంపాట పెడతారు. ఎవరైతే ఎక్కువ మొత్తానికి పాడుతారో వాళ్లే ఆ ఏడాదికి రామలక్ష్మణులు. మోదుకొండమ్మ జాతర సందర్భంగా ఏటేటా నిర్వహించే ఈ వేడుకలు చూడటానికి, చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఉత్సాహంగా ప్రజలు తరలివస్తారు.