తూర్పుగోదావరి జిల్లా గోకవరం యువకుడు అనంత్మాకుల వెంకట నరసింగరావు(31) దేెహ్రాదూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలింగ్‌లో జియోసైన్సు ఇంజినీరింగ్ ప్రథమశ్రేణిలో పాసయ్యారు. చిన్ననాటి నుంచి పాడిపంటల మీదున్న మక్కువతో చదువయ్యాక సొంతూరు వచ్చారు. సుభాష్‌పాలేకర్ గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో స్ఫూర్తి పొందారు. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు మొదట్లో అభ్యంతరం చెప్పినా.. నరసింగరావు ఆసక్తిని గమనించి సరేనన్నారు. తొలుత మూడెకరాలతో ప్రారంభించారు. ప్రస్తుతం వారికున్న ఎనిమిది ఎకరాలకు అదనంగా 13 ఎకరాలు కౌలుకు తీసుకొని నాలుగేళ్లుగా ఈ తరహా వ్యవసాయం చేస్తున్నారు. కాలాబట్టి, నవారా, కొల్లాకర్, విష్ణుభోగి, ఇంద్రాణి, నారాయణకామి, కూజీపడాలియా, మైసూర్ మల్లిక, సిద్ధసన్నాలు వంటి తొమ్మిది రకాల దేశీయ వరి వంగడాలను సాగుచేస్తున్నారు. మామిడి, జీడిమామిడి పెంచుతున్నారు.
గో ఉత్పత్తులే ఎరువు..
రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా.. ఆవు నుంచి వచ్చే పేడ, పాలు, పెరుగు, నెయ్యి, ఆకులు, వివిధ పదార్థాలతో తయారు చేస్తున్న... ద్రవ, ఘనజీవామృతాలు, నీమాస్త్రం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ, ఇతర కషాయాలను పొలాల్లో జల్లుతున్నారు. దీనివల్ల పైర్లలో వ్యాధి నిరోధకత పెరిగి... తెగుళ్లు, చీడపీడలను తట్టుకోగలుగుతున్నాయి. సాలు(లైన్‌సోయింగ్) పద్ధతిలో వరి నాట్లు వేయడంతో తెల్లదోమ నుంచి రక్షణ లభించింది. ప్రకృతి వ్యవసాయంతో మిత్ర కీటకాలకు హాని జరగదు. జీవవైవిధ్యం దెబ్బతినదు. నీటి వినియోగంతోపాటు ఎరువులు, పురుగుమందులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇలా పండించిన ఆహారం తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, అల్సర్, స్థూలకాయం తదితర సమస్యలు దరిచేరవు.