తూర్పుగోదావరి జిల్లాలో వాడవాడలా కార్మిక దినోత్సవం
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాడవాడలో జెండాలు ఎగుర వేసి, ర్యాలీలు చేపట్టారు.
రాజమహేంద్రవరంలో భారీ ర్యాలీ...
కార్మిక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఏఐయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇన్నీస్పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి జాంపేట, కంబాల చెరువు, నందం గనిరాజు సెంటర్, బైపాస్ రోడ్డు మీదుగా తాడితోట వరకు ర్యాలీ చేపట్టారు. నృత్యాలు,నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ర్యాలీ సాగింది. ఈ ప్రదర్శనలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో మే డే వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. కొబ్బరి కార్మికులు, ఆర్టీసీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సీపీఐ నాయకులు పాల్గొని కార్మిక జెండాను ఎగురవేశారు. జిల్లాలోని గోకవరం మండలంలో "మేడే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖలోని కార్మికులు గోకవరంలో ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.