తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం, మైదానం, కోనసీమలో వానలు కురుస్తున్నాయి. కాకినాడ, రామచంద్రాపురం, రాజమహేంద్రవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గోదావరి తూర్పు, మధ్య డెల్టాలతోపాటు మెట్ట ప్రాంతంలోనూ వరి పంట తడిసిపోవటంతో రైతులు నష్టపోయారు. కోసిన వరి పంట నీటిలో నానుతుండడంతో నాణ్యత, మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిస్థితిపై కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ సమీక్షించారు.
నష్టాలు మిగిల్చిన నివర్..
నివర్ ప్రభావంతో తెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో కోతకు సిద్ధమైన వరిచేన్లు చాలాచోట్ల నేలకొరిగాయి. వర్షాలకు పంటతోపాటు నిల్వలూ తడిసి మిగిలిన పంటల కోతకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఉప్పలగుప్తంలో 1,850 హెక్టార్లలో వరి పడిపోయింది. అమలాపురం 1,450, రాజోలు 996, తొండంగి 706, మామిడికుదురు 685, అల్లవరం 650 హెక్టార్లలో పంట నేలకొరిగింది. పి.గన్నవరం, మలికిపురం, అయినవిల్లి, సామర్లకోట, కోరుకొండ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పాడ కొత్తపల్లి, కాజులూరు, మలికిపురం మండలాల్లో పంట తడిసింది. సామర్లకోట 2,000, రామచంద్రాపురం 1,400 హెక్టార్లలో కళ్లాల్లో ఉంచిన ధాన్యం తడిసింది. పెదపూడి 1,500, మండపేట 1,200, కపిలేశ్వరపురంలో వెయ్యి హెక్టార్ల పంట దెబ్బతింది.
తీరంలో గుండెకోత
నివర్ తుపాను నేపథ్యంలో యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరప్రాంతంలో స్వల్పంగా ప్రభావం చూపింది. సముద్రంలో మార్పులు ఏర్పడి రెండు రోజులుగా రాత్రి సమయంలో భారీ కెరటాలు ఎగసిపడడంతో తీరప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి. ప్రధానంగా ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలు సముద్రాన్ని ఆనుకుని ఉండడంతో కెరటాలు నేరుగా గృహాలను తాకాయి. దీంతో పలు ఇళ్లు నేలకూలగా, మరికొన్ని బలహీనపడి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. తుపాను సమయంలో ప్రతిసారి ఈ గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలకూలి ఎన్నో కుటుంబాలు నీడ లేకుండా పోతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పొలాలు నీట మునిగాయి. డ్రైన్లు పొంగి ప్రవహించడంతో రహదారులపై నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి.
ఏలేరు నుంచి 2100 క్యూసెక్కుల నీరు విడుదల