ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు ప్రమాదాలు జరగకుండా కొత్త పాలసీ: కిషన్​

కచ్చులూరు వద్ద బోటును బయటకు తీసేందుకు కేంద్రం తరఫున సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేనందుకే వెలికితీత పనులు ఆగిపోయాయని వెల్లడించారు. ప్రమాద బాధితులను కాపాడిన వారికి త్వరలోనే రివార్డు ఇచ్చే ఆలోచన చేస్తామని అన్నారు.

By

Published : Sep 22, 2019, 8:14 PM IST

Updated : Sep 22, 2019, 8:48 PM IST

కిషన్ రెడ్డి

బోటు ప్రమాదాలను నివారించేందుకు చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి హాజరైన ఆయన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై సమీక్షించారు. కచ్చులూరు బోటు ప్రమాదంపై రాష్ట్రప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక పరిశీలించి కొత్త పాలసీ కఠినంగా ఉండేలా చూస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత బోటు రవాణా చట్టాన్ని మార్చి పటిష్ఠం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర చట్టాలను సైతం కఠినతరం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి
మీడియాతో కలెక్టర్

అందుకే సహాయక చర్యలు ఆగిపోయాయి
బోటు ప్రమాదం జరిగిన చోట పరిస్థితులు అంత అనుకూలంగా లేవని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బోటు మట్టిలో కూరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. దీనికి కేంద్రం తరపున ఎలాంటి సాంకేతిక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే 20 మందికి పైగా కాపాడిన కచ్చులూరు గ్రామస్థులు, జాలర్లకు త్వరలోనే సహకారం అందిస్తామని వెల్లడించారు. బోటు వెలికితీతకు సంబంధించి నిపుణులతో చర్చించామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పారు. వరద ఉద్ధృతి కొనసాగటం, లోతైన ప్రాంతం కావటం వల్లే స్థానిక మత్స్యకారులతో బోటు బయటకు తీసే అవకాశం ఇవ్వలేదని అన్నారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మృతదేహాలు లభ్యం కాకపోతే అందరికీ మరణ ధృవీకరణ పత్రాలు ఇస్తామని కలెక్టర్‌ చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎమ్మెల్యే రాజా, ఎన్డీఆర్​ఎఫ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Last Updated : Sep 22, 2019, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details