ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల వేటపై నిషేధం... కష్టాల్లో మత్స్యుకారులు - fishermen

సముద్ర ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపల వేటపై నిషేధం విధించింది. తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు రెండు నెలలపాటు ఉపాధి కోల్పోనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు, బోటు యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాష్ట్రప్రభుత్వం ఈ సమయంలో బాసటగా నిలిచినా... తమకు కష్టాలు తప్పవని మత్స్యుకారులు చెబుతున్నారు.

చేపల వేటపై నిషేధం... కష్టాల్లో మృత్స్యుకారులు

By

Published : Apr 17, 2019, 6:12 AM IST

Updated : Apr 17, 2019, 6:55 AM IST

చేపల వేటపై నిషేధం... కష్టాల్లో మృత్స్యుకారులు

మత్స్యసంపదను వృద్ధి చేయాలని ఏటా ప్రభుత్వం రెండు నెలలపాటు వేటపై నిషేధం అమలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటపై నిషేధం విధించింది. మత్స్యసంపద వృద్ధికి ఏప్రిల్, మే, జూన్ నెలలే కీలకం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చేపలు గుడ్లు పెట్టి... పొదిగే సమయమిది. ఈ దశలో వేటాడితే మత్స్యసంపద తగ్గిపోయే ప్రమాదముంది. అందుకే ప్రభుత్వం వేట నిషేధం అమలు చేస్తోంది. అయితే చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో 164 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతముంది. 60, 600 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆదారపడి జీవనం సాగిస్తున్నారు. తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, కరప, తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో మత్స్యుకారుల సంఖ్య ఎక్కువ. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం జీవన భృతి ఇస్తోంది. కానీ సర్కారు ఇచ్చే రూ.4 వేలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, సమయానికి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భృతి పెంచాలని కోరుతున్నారు.

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే జీవన భృతి పొందాలంటే బోట్లకు లైసెన్సులు, రిజిష్ట్రేషన్లు తప్పనిసరి. మోటారు బోటుదారులకు మాత్రమే భృతి ఇస్తారు. జిల్లాలో 4 వేల మోటారు బోట్లు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. వేట విరామ సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. సముద్రంలో చేపల సంపద పెంచాలనే ఉద్దేశంతో చేపట్టిన వేట విరామానికి ప్రతిఒక్కరూ సహకరించాలని అధికారులు మత్స్యకారులను కోరుతున్నారు.

వేట నిషేధ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన మత్స్యకారులు, బోటు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బోటు యజమానికి జరిమానా విధించడంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నిలిపివేస్తాం. మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు విరామ సమయంలో ఇచ్చే భృతి పెంచే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
-వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు

Last Updated : Apr 17, 2019, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details