తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థులు హామీలు ఇవ్వటం, ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా మారింది. ఈ మండలంలో 10 వరకు లంక గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దూరంలోని కొత్తపేట, రాజోలు అమలాపురం అగ్నిమాపక కేంద్రాల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇంతలో పూర్తిగా నష్టం జరిగి బాధితులు నిరాశ్రయులవుతున్నారు. ఐదేళ్ల క్రితం పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఉత్తర్వులు వచ్చాయని పాలకులు చెప్పారు. అనువైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి వివరాలు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు పంపారు. పోతవరంలోని గోరింకల ప్రధాన మురుగుకాలువ చెంత ఉన్న ప్రభుత్వ భూమిని దీనికోసం గుర్తించారు. నేటికీ ఇది సాకారం కాలేదు . మళ్లీ ఏడాదిన్నర క్రితం కేంద్రం మంజూరు అయిందని చెప్పారు. కానీ ఇప్పటివరకు కదలిక లేదు. అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని అభ్యర్థన
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణ విషయంలో అధికారులు అలసత్వం చూపుతున్నారని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలంలోని గ్రామాలు ప్రమాదాల సమయంలో సుదూరాన ఉన్న అగ్నిమాపక కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ మండలంలో ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
అగ్నిమాపక కేంద్రం