న్యాయవాది అక్రమ నిర్బంధం కేసులో కోర్టుకు హాజరైన ఎస్పీని ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై డీజీపీ కమిటీని ఏర్పాటు చేశారని... న్యాయవాది తమ అదుపులో లేరని... తప్పించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టులతో సహా ఎవరూ చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేసింది. న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ఆక్రమ నిర్బంధంపై దాఖలైన వ్యాజ్యంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
రాత్రిపూట ఒంటిగంటకు న్యాయవాది ఇంటికెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏదైనా నేరస్థుడి ఇంట్లోకి సైతం ఆ తరహాలో ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. రాత్రి సమయంలో న్యాయవాది ఇంటికెళ్లి పోలీసులు వెతికారంటే... ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో ఆలోచించారా అని కోర్టుకు హాజరైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సయీంఅస్మిని ప్రశ్నించింది. ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' లేనట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.
పోలీసులు ఉంది ప్రజల హక్కుల్ని కాపాడేందుకేకాని.. రాజకీయ నేతల అభీష్టం మేరకు వ్యవహరించేందుకు కాదని స్పష్టం చేసింది. పోలీసు అధికారులకు వ్యతిరేకంగా కోర్టు ఏమైనా ఉత్తర్వులు జారీచేస్తే కష్టాల్లో పడతారని పేర్కొంది. అప్పుడు ఏ రాజకీయ నేత పోలీసుల్ని ఆదుకోవడానికి ముందుకు రారని వ్యాఖ్యానించింది. యూనిఫాంలో ఉన్నంత కాలం ప్రజా రక్షకులుగా మెలగాలని హితవు పలికింది. పోలీసులు ఇంటికెళ్లిన సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకున్నారని, ప్రస్తుతం పోలీసుల అదుపులో లేరని, ఎక్కడున్నారో కనుగొనేందుకు చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.
ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... డీజీపీని పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్పీ సైతం వివరణ ఇస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని పేర్కొంది. అక్రమ నిర్బంధంపై దాఖలైన ఓ వ్యాజ్యంతో ప్రస్తుత వ్యాజ్యాన్ని జత చేయాలని ఆదేశించింది. ఈలోపు న్యాయవాది సుభాష్ చంద్రబోస్‌ను పోలీసులు కనుగొంటే హైకోర్టులో హాజరుపరచాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.