ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతివల శక్తి అవనికి చాటుతున్నారు.. ఆ రైల్వే స్టేషన్​లో అందరూ మహిళా ఉద్యోగులే! - మహిళా రైల్వే స్టేషన్ న్యూస్

అతివల శక్తి సామర్థ్యాలను అవనికి చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ మహిళలు. వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ మహిళల శక్తి సామర్థ్యాలను ఘనంగా చాటుతున్నారు. స్త్రీలకు సమాన గౌరవం, వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా చేపట్టిన మహిళా రైల్వేస్టేషన్‌ను నాలుగేళ్లుగా విజయవంతం నిర్వహిస్తున్నారు. స్టేషన్‌ సూపరింటెడెంట్‌ మొదలు.. కీ మెన్‌ వరకు అన్ని స్థాయిల్లో బాధ్యతలు చేపట్టిన అతివలు తమ పనితనంతో ప్రశంసలందుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందడంతో పాటు.. మెరుగైన సేవలు అందిస్తున్న చంద్రగిరి రైల్వేస్టేషన్‌ మహిళా సిబ్బందిపై.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

అతివల శక్తి అవనికి చాటుతున్నారు
అతివల శక్తి అవనికి చాటుతున్నారు

By

Published : Mar 5, 2022, 10:15 PM IST

ఆ రైల్వే స్టేషన్​లో అందరూ మహిళా ఉద్యోగులే !

స్త్రీలకు సమాన ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారికత లక్ష్యంగా రైల్వేశాఖ కల్పించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న వనితలు.. విజయవంతంగా విధులు నిర్వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా ప్రకటించి అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మహిళలే నిర్వహించేలా చిత్తూరు జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్​ తీర్చిదిద్దారు. కీ ఉమెన్‌ మొదలు సూపరింటెండెంట్ వరకు అన్ని విభాగాల్లోనూ మహిళలనే నియమించారు.

అత్యంత కీలకమైన ఆపరేషన్‌ విభాగంతోపాటు కమర్షియల్‌, సిగ్నలింగ్‌ ఇలా పలు విభాగాల్లో బాధ్యతలు చేపట్టిన మహిళలు తమ విధులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ మెరుగైన సేవలు అందించడం ద్వారా నాలుగు సంవత్సరాల కాలంలో ఉన్నతాధికారుల ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నారు.

చంద్రగిరి రైల్వే స్టేషన్​లో ఓ స్టేషన్ సూపరింటెండెంట్, ముగ్గురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లతోపాటు మరో ముగ్గురు సహాయక మహిళా సిబ్బంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ పరిశుభ్రత మొదలు ప్రయాణీకుల భద్రత వరకు.. ఫ్లాట్‌ ఫాంపై రైళ్లు ఆగటం నుంచి కదిలే వరకు ఉన్న 14 విభాగాల బాధ్యతలు మహిళలే చేపట్టారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ ఫాం కొరతతో.. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్‌ రైళ్లను చంద్రగిరి రైల్వేస్టేషన్​లో ఎక్కువ సమయం ఆపుతున్నారు. రైళ్లు ఎక్కువ సమయంలో స్టేషన్‌లో ఆపేయడంపై ప్రయాణీకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నా.. క్లిష్ట పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొంటూ విధులను నిర్వహిస్తున్నారు.

రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో అత్యంత క్లిష్టమైన విధులను సైతం సమర్థంగా నిర్వహిస్తున్న మహిళలు.. తమ శక్తిని గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించింనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో సమానంగా తాము పనిచేయగలమని నిరూపించుకొనేందుకు వచ్చిన అవకాశంగా భావిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తామంటున్నారు. స్టేషన్​లో అంతా మహిళలమే కావటంతో సమష్టిగా పనిచేస్తున్నామంటున్నారు.

దాదాపు నాలుగు సంవత్సరాలుగా చంద్రగిరి రైల్వేస్టేషన్‌ నిర్వహణను తమ భుజ స్కందాలపై వేసుకొన్న మహిళా సిబ్బంది.. ఒక్క ఫిర్యాదు రాకుండా విధులు నిర్వహిస్తూ అతివల శక్తి సామర్థ్యాలను అవనికి చాటుతున్నారు.

ఇదీ చదవండి :
ఆటలాడే వయసులో రోబో తయారీ- 'ఇండియా రికార్డ్స్​'లో చోటు

ABOUT THE AUTHOR

...view details