TTD:తిరుమల అంజనాద్రిలో ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి, సుందరీకరణ పనులకు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. తితిదే వైఖానస ఆగమ సలహదారు కంకణబట్టార్ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన సభలో విశాఖ శారదపీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణ కళాకృతులను ఆవిష్కరించారు. అంజనేయస్వామివారి జన్మస్థలం అంజనాద్రి- తిరుమల పుస్తకాన్ని శ్రీ రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఆవిష్కరించారు. అంజనాద్రి వైశిష్ట్యంపై ఎస్వీబీసీ రూపొందించిన దృశ్య శ్రవణ గీతాన్ని చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు ఆవిష్కరించారు.
రెండు సంవత్సరాల క్రితం పండిత పరిషత్ ఏర్పాటు చేసి పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ 4 నెలల పాటు క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేశామని తితిదే ఈఓ జవహర్‌రెడ్డి తెలిపారు. ఆలయంలో ఎలాంటి మార్పు చేయడం లేదని, ఆలయ ప్రాంగణం అభివృద్ధి, సుందరీకరణ పనులు మాత్రమే చేపడుతున్నామన్న తి.తి.దే. ఛైర్మన్..... వివాదాలకు తావులేకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
భూమిపూజ శిలాన్యాస్ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమావేశంలో పీఠాధిపతులు, సాధు సంపత్తులు అనుగ్రహ భాషణం చేశారు. అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమనటానికి ఎలాంటి సందేహం లేదన్నారు.